GENERAL ELECTIONS SCHEDULE
- 28న షెడ్యూల్ వచ్చే ఛాన్స్
- దేశవ్యాప్తంగా ఐదు దశల్లో ఎన్నికలు
- తెలంగాణలో తొలి దశలో.. ఏపీలో రెండో దశలో నిర్వహణ
సార్వత్రిక సమరానికి తెర లేవడానికి రంగం సిద్ధమవుతోంది. లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం తన కసరత్తు దాదాపు పూర్తి చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల 28న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోగా మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగించే దిశగా ఈసీ తేదీలు ఖరారు చేసినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనుంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కు ఆటంకం కలగకుండా షెడ్యూల్ రూపొందించింది. ఈనెల 28న షెడ్యూల్ విడుదల కానుండగా.. మార్చి 3న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. వాస్తవానికి మే 16వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా.. అంతకు 15 రోజుల ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది. మే నెలలో ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక లోక్ సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకూ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో తొలి దశలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. ఏపీలో రెండో దశలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.