ఆరేళ్లయ్యింది.. ఇంకా ప్రణాళికేనా?

28
Ghmc Elections Stunt?
Ghmc Elections Stunt?

Still In Planning Stage?

రాష్ట్రంలో అన్ని రకాల వ్యర్థ పదార్థాల నిర్వహణ పై త్వరలోనే సమగ్ర ప్రణాళికను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. జీడిమెట్లలో ఏర్పాటుచేసిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్  మాట్లాడుతూ.. రాష్ట్రంలో ద్రవ వ్యర్థాలు, జీవ వ్యర్థాలు, మల వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై ఇప్పటికే ప్రత్యేక శుద్ది కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నగరంలో రోజు 2వేల మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని, జీడిమెట్లలో ఏర్పాటు చేసిన రీసైక్లింగ్ ప్లాంట్ ద్వారా రోజుకు 500 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయనున్నట్లు తెలిపారు. మరో 500 టన్నుల సామర్థ్యం గల రీసైక్లింగ్ ప్లాంట్ ను త్వరలోనే ఫతుల్లగూడలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఎక్కడైన భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800-1200-72659 అనే నెంబర్ కు ఫోన్ చేయాలని కె.టి.ఆర్ తెలిపారు. జీడిమెట్లలో ప్రారంభించిన భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ దక్షణ భారతదేశంలో అతిపెద్దది, అత్యాధునికమని వెల్లడించారు.

వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ నగరం దేశంలోనే ఆదర్శంగా ఉందని అన్నారు. జవహర్ నగర్ లో 6 వేల టన్నుల మున్సిపల్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ను మరికొన్ని రోజుల్లోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. నగరంలో రోజుకు 2 వేల మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు విడుదలవుతున్నాయని, వీటిలో 41 శాతం జలాలను సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్దిచేసి మూసిలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరేళ్లయ్యింది.. కేంద్ర ఘనవ్యర్థాల నిర్వహణపై మార్గదర్శకాల్ని గతంలోనే విడుదల చేసింది. అయినా, వ్యర్థాల నిర్వహణపై సమగ్ర ప్రణాళిక త్వరలో విడుదల చేయడమేమిటో అర్థం కావడం లేదని నగర వాసులు అంటున్నారు. ఈ సమగ్ర ప్రణాళికను ఇప్పటికే ఏర్పాటు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల స్టంటు కోసమే ఇలాంటి ప్రారంభోత్సవాల్ని మంత్రి కేటీఆర్ చేస్తున్నారని భాగ్యనగరవాసులు విమర్శిస్తున్నారు.

#GhmcElections2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here