తిరుపతి ఆలయంలో మూడు బంగారు కిరీటాలు మాయం

Diamond Studded Crowns were Missing in thirupathi temple

తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో ఉత్సవమూర్తుల కిరీటాలు మాయం అయ్యాయి. అత్యంత భద్రత ఉండే ప్రాంతం నుంచి బంగారు కిరీటాలు మాయమవ్వడం కలకలం రేపుతోంది. నిన్న జరిగిన కిరీటాల అదృశ్యం ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం కావడం సంచలనంగా మారింది. ఆలయంలో ఉత్సవ మూర్తులకు అలంకరించే కిరీటాలు అదృశ్యమైనట్టు అధికారులు నిన్న సాయంత్రం గుర్తించారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిరీటాలు మాయమైన ఘటనపై పోలీసులు, విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. గోవిందరాజ స్వామి ఆలయ అధికారులు, సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. మూడు కిరీటాల చోరీ సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపీనాథ్‌ జెట్టి ఆలయంలో విచారణ చేపట్టారు. గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు, పార్థపారధి, హరికృష్ణలను విచారించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ ప్రత్యేకంగా 6 బృందాలను నియమించి దర్యాప్తు చేపట్టారు. చోరీ ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీంను రంగంలోకి దించారు. రాత్రి 9గంటలకు కిరీటాల దొంగతనం గురించి టీటీడీ విజిలెన్స్ నుంచి సమాచారం అందిందని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 13 వందల గ్రాముల శ్రీదేవి, భూదేవి సమేత వేంకటాచలపతి బంగారు కిరీటాలు మాయమైనట్లు వివరించారు. గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు మాయమైన ఘటనలో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించామని అయితే కొన్ని అనుమానాలున్నాయని ఎస్పీ చెప్పారు. గతంలో టీటీడీ పరిధిలోని శ్రీ కోదండ రామాలయంలోని కిరీటాన్ని ఓ అర్చకుడు తాకట్టు పెట్టుకున్నాడు. ఇప్పుడు గోవిందరాజస్వామి ఆలయంలో ఏకంగా మూడు బంగారు కిరీటాలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article