ఎస్టీలకు స్వర్ణయుగం

Golden Days To Telangana Tribals

అసెంబ్లీలో తొలిసారిగా గిరిజన, మహిళా-శిశు సంక్షేమం పద్దులపై మాట్లాడిన మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. గిరిజన సంక్షేమంలో సిఎం కేసిఆర్ పాలనలో గత 5ఏళ్లు.. గత ప్రభుత్వాల పాలనలోని గడిచిన 50ఏళ్లు ఒక ఎత్తు అని అన్నారు. మహిళలు, గిరిజనులు కూడా సమాజంలో సగౌరవంగా, సమానంగా జీవించాలనే లక్ష్యంతో సిఎం కేసిఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సిఎంగారు ప్రవేశపెట్టిన ఈ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సరైన విధంగా చేరేందుకు కృషి చేస్తానని చెప్పారు.  గత ప్రభుత్వాల్లో ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి మళ్లించి గిరిజనులను కూలీలుగా పనిచేయించిన విధానాన్ని ప్రశ్రించాము. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఇంకా ఎక్కువగా నిధులు గిరిజనుల కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఇదన్నారు.  గిరిజనుల కోసం దాదాపు 140-145 పథకాలు అమలు చేస్తున్నారు. తండాలో పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే ఉంటున్న తనకు గిరిజనులు, ఆదివాసీలు సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆశీర్వాదంతో ఈ శాఖకు మంత్రిగా ఆయన ఆలోచన మేరకు, సభ్యుల సహకారంతో ఈ శాఖను సమర్ధవంతంగా నిర్వహించేందుకు నా సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.

ఇక ఐటీడీఏలను పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష సభ్యులు చేసిన ఆరోపణలు వాస్తవం కాదు. ఐటీడీఏల కోసం ఐఎఎస్ లను పెట్టి పరిపాలన చేస్తున్న ప్రభుత్వం సిఎం కేసిఆర్ ది. ఐటీడీఏలు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక బాగా బలోపేతం అయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వాలలో వాటిని పట్టించుకోలేదని నేను కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. కానీ నేడు ఆపరిస్థితి లేదు. గిరిజన సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. గిరిజన తండాలకు , ఆదివాసి గూడాలకు కనీసం మంచినీటి సదుపాయం లేకుండా ఉంటే…మిషన్ భగీరథ పథకం ద్వారా నేడు ఇంటింటికి నీరు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వరంగల్ లోని ఒక గిరిజన కుటుంబంలో ఆడపిల్ల పెళ్లి చేయడానికి తండ్రి పడిన బాధను చూసిన సిఎం మది నుంచి వచ్చిన ఆయన మానస పుత్రిక కళ్యాణలక్ష్మీ  పథకం. ఈ పథకం కింద గిరిజన కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి ఇస్తున్న ఆర్ధిక సాయం ఆ కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేడు గిరిజన కుటుంబంలో ఆడపిల్ల పుడితే ఎలాంటి చింతించాల్సిన పనిలేకుండా సిఎం కేసిఆర్ గారు కళ్యాణలక్ష్మీ ద్వారా భరోసా కల్పించారని వివరించారు.

గతంలో ఎప్పుడు లేనివిధంగా, ఎక్కడా లేనివిధంతా గిరిజన హాస్టళ్లలోని విద్యార్థులకు కేసిఆర్ పాలనలో సన్నబియ్యం తింటున్నారు. అవకాశాలిచ్చి, వసతులు కల్పిస్తే సమాజంలో ఎవరికీ తాము తీసిపోమని గిరిజన విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతాలతో నిరూపిస్తున్నారు. మాలోతు పూర్ణ వంటి విద్యార్థినిలు ఎవరెస్టు శిఖరాన్ని సిఎం కేసిఆర్ చేయుతతో అధిరోహించి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటారని చెప్పారు. విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కేసిఆర్ పాలనలో కొత్తగా 83 గిరిజన గురుకులాలు వచ్చాయి. గత 50 ఏళ్లుగా 94 గిరిజన గురుకులాలుంటే…గత 5 ఏళ్లలో 83 కొత్త గురుకులాలు రావడంతో మొత్తంగా గిరిజనులకు 177 గురుకులాలు అందుబాటులోకి వచ్చి ఎక్కువ మంది గిరిజనులకు రెసిడెన్షియల్ విద్య అందుబాటులోకి వచ్చిందని వివరించారు. గతంలో ఒక్కో శాఖకు చెందిన గురుకులాల్లో ఒక్కో రకమైన మెను ఉండేది…కానీ సిఎంగా కేసిఆర్ అయిన తర్వాత ఇప్పుడు అన్ని గురుకులాల్లో ఒకేరకమైన, పోషకాహరంతో కూడిన మెనును అందిస్తున్నారని చెప్పుకొచ్చారు.

రైతు బంధు పథకం ద్వారా ఎకరం, రెండెకరాలు భూమి ఉన్న గిరిజన రైతులు కూడా నేడు వ్యవసాయం చేసుకుంటున్నారు. గతంలో కరెంటు మోటార్లతో వ్యవసాయం చేసిన మా గిరిజన రైతు సోదరులు నేడు కాలువల నీటితో వ్యవసాయం చేయడం కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ గారి కృషి వల్లే సాధ్యమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి త్వరలో అందరికీ నీళ్లు రాబోతున్నాయని తెలిపారు. మహిళలు గర్భం దాల్చిన నుంచి బిడ్డ ప్రసవించే వరకు కేసిఆర్ కిట్, పోషకాహారం, ఆడపిల్ల పుడితే అదనంగా వెయ్యి రూపాయలు, తల్లీ, బిడ్డలకు వ్యాక్సిన్స్, మందులు, ప్రసవించిన తర్వాత తల్లీ, బిడ్డలు, కుటుంబసభ్యులను ఇంటివద్ద దించడం వంటి అనేక పథకాలు మహిళల కోసం అమలు చేస్తున్నారు. ప్రతి పైసాను క్షేత్రస్థాయిలోని గిరిజనులు, మహిళలకు అందించేలా అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు.

గతంలోని ప్రభుత్వాలు తండాలను గ్రామపంచాయతీలుగా చేస్తామని గిరిజనులను ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకుంటే…సిఎం కేసిఆర్ గారు మాత్రం చెప్పిన మాట ప్రకారం తండాలను గ్రామ పంచాయతీలు చేశారు. దీనివల్ల అనేక మంది గిరిజనులు నేడు పాలకులుగా మారారు. నేను సర్పంచ్ గా  పనిచేసిన గ్రామం నేడు ఆరు గ్రామాలుగా ఏర్పడితే ఆరుగురు గిరిజనులు సర్పంచ్ లు కావడం సిఎం కేసిఆర్ గారి కృషి వల్లే జరిగింది.  గత ప్రభుత్వాలు గిరిజనులను నిర్లక్ష్యం చేస్తే…సిఎం కేసిఆర్ గిరిజన బిడ్డలను అభివృద్ధి చేయడానికి, అన్ని రంగాల్లో వారిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయనను అభినందించాలని పిలుపునిచ్చారు. గిరిజన విశ్వవిద్యాలయం కోసం కేంద్రం అడిగినట్లు భూమి కేటాయిస్తే…దానికి మంజూరు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుంది. గిరిజన ప్రాంతంలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఉండాలన్న లక్ష్యంతోనే ములుగులో భూమి కేటాయించాము. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను కూడా కేటాయించిందన్నారు. గిరిజన అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా 2017-18 సంవత్సరంలో 170 కోట్ల రూపాయలు వస్తే…ఈ ఏడాది 230 కోట్ల రూపాయలకు ఈ ఆదాయం పెరిగింది. వచ్చే ఏడాదికి 400 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలు చేయడం కోసం వి-హబ్ ఏర్పాటు చేసి వారి ఉన్నతికి ఈ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు.

 

satyavathi rathod latest news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *