Governor Tamilisai Sounderarajan Serious On Priyanka Reddy
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యోదంతంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. షాద్ నగర్ శివారులో ప్రియాంకా రెడ్డిపై జరిగిన దారుణానికి సంబంధించి ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. కేసు విచారణలో ఎలాంటి జాప్యం చోటు చేసుకోనివ్వకుండా చూడాలని ఆమె పోలీసు యంత్రాంగాన్ని సూచించినట్లు తెలుస్తోంది. ప్రియాంక రెడ్డి హత్యోదంతం కేసును ఫాస్ట్ ట్రాక్ ద్వారా రోజువారి విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. తమిళిసై సౌందరరాజన్ శనివారం మహిళా డాక్టర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి, ఈ కేసు విచారణను శరవేగంగా ముగించాలని, త్వరితగతిన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని తాను తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఓ నోట్ ను పంపించినట్లు తమిళిసై వెల్లడించినట్లు ఆ జాతీయ మీడియా వెల్లడించింది.ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానానికి కేటాయించడం ద్వారా రోజువారీ విచారణను చేపట్టడానికి అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
యావత్ దేశాన్ని ఈ ఘటన కదిలించిందని, దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులకు సత్వర న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్లా కావట్లేదని, ఇంతటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.వెటర్నరి డాక్టర్ కుటుంబ సభ్యులతో తాను సుమారు అరగంటకు పైగా గడిపానని, వారి నుంచి తనకు పలు సూచనలు, సలహాలు అందాయని అన్నారు. వాటన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి పంపించినట్లు చెప్పారు.ప్రియాంకా రెడ్డి ఘటన నేపధ్యంలో సర్కార్ నోట్ పంపి , స్వయంగా కేసును పర్యవేక్షించి దోషులను శిక్షించేలా చూస్తానని గవర్నర్ తమిళిసై తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.