Govt Serious on UDS sales
యూడీఎస్పై టీఎస్ న్యూస్ కథనాలపై స్పందన
యూడీఎస్ అమ్మకాలపై వ్యతిరేకంగా టీఎస్ న్యూస్ రాస్తున్న కథనాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. యూడీఎస్ కింద ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ కొనుగోలు చేయకూడదని ఆదేశించింది.యూడీఎస్ అమ్మకాల వల్ల జరిగే దుష్ఫలితాల్ని మొట్టమొదట వెలుగులోకి తెచ్చింది టీఎస్ న్యూస్ పోర్టల్. ఈ అంశానికి గల ప్రాధాన్యతను గుర్తించిన ఇతర మీడియా సంస్థలు యూడీఎస్ కథనాల్ని ప్రచురించాయి. ఎట్టకేలకు యూడీఎస్ అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రెరా అనుమతి లేకుండా కొనుగోలు చేసే ప్లాట్లు, ఫ్లాట్లను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదని తెలియజేసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం క్రెడాయి, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు మరియు టీఎస్ రెరా అధికారులతో సమావేశం నిర్వహించారు. సామాన్య ప్రజలకు అవిభక్త వాటాల భూముల అమ్మకం మోసానికి దారితీస్తుందని క్రెడాయి, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులకు టిఎస్ రెరా అధికారులు తెలియజేశారు. తదనుగుణంగా ప్రజలకు అవసరమైన సూచనలు / పత్రికా ప్రకటనలను జారీ చేయాలని రెరా కార్యదర్శి మరియు స్టాంపులు రిజిస్ట్రేషన్లు కమిషనర్, ఐజి ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. యుడిఎస్ భూములను కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు, తెలంగాణ స్టేట్ రెరాలో నమోదు కాని సంస్థల యుడిఎస్ భూముల కొనుగోళ్లు భవిష్యత్తులో వ్యాజ్యానికి దారి తీయవచ్చునని తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించి, ఇటువంటి మోసపూరిత అమ్మకాలు జరిగిన చోట తగిన చర్యలు తీసుకోవాలని హోమ్ శాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా కు ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్, శేషాద్రి, డిటిసిపి/రెరా సెక్రటరీ విద్యాధర్, ఇతర అధికారులు మరియు క్రెడాయి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.