దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కుటుంబాలన్నీ కలిసి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే కల్చరల్ కార్యక్రమాలకు మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ వేదికగా నిలిచింది. చిన్నారులు, యువతీ యువకులందరూ కలిసి కల్చరల్ ఫెస్ట్‌ను ఘనంగా జరుపుకున్నారు. దాదాపు ఐదు గంటల పాటు ఉత్సాహభరితంగా కార్యక్రమం జరిగింది.
పంచతంత్ర మ్యూజికల్ బ్యాండ్ నిర్వహించిన మ్యూజిక్ ఉర్రూతలూగించింది. ముఖ్యంగా జుగల్బంది ఆహుతుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. శ్రేయా క్లాసికల్ డాన్స్ తో కల్చరల్ ఫెస్ట్ ఆరంభమయ్యాక.. చిన్నారులు హృదయాంశ్, ధైర్య, యజ్ఞా చేసిన నృత్యం ఆకట్టుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కు చెందిన విభిన్నమైన పాటలకు యువతీయువకుల వినూత్నమైన డాన్స్ కంపోజింగ్ ప్రేక్షకుల్ని రంజింప చేసింది. తెలుగు స్పార్కిల్స్ గ్రూప్, తారీఫన్ డ్యాన్స్, వీ3, డాజ్లింగ్ స్టార్స్, పరి గ్రూప్, హాలీవుడ్ మిక్స్, దీపా గ్రూప్ డాన్సులు వంటివి ఆకర్షణీయంగా ఉన్నాయి. విమల్ కొఠారీ, మొనాలీ కొఠారీ ఫ్యామిలీ డాన్స్, చవత్ బాయ్స్ 3.0 రీలోడెడ్ గ్రూప్ డాన్స్ వంటివి ప్రతిఒక్కర్ని ఆకట్టుకుంది. చిన్నారులు ఆరో, తిథి గోయల్, లయా సోనాక్షి, దీత్యా మరియు కేతన గ్రూపులు కలిసి ముద్దుముద్దుగా పాటల్ని ఆలపించారు. చిన్న వయసులో తమ చిన్నారుల ప్రదర్శన చూసి తల్లిదండ్రులెంతో ఆనందించారు. కిడ్స్ ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్, రేయాంశ్ మ్యూజికల్ ఇన్స్రుమెంటల్ వంటివి చూసి ప్రతిఒక్కరూ వావ్ అని మెచ్చుకున్నారు.
* గత రెండేళ్ల నుంచి కొవిడ్ వల్ల కుటుంబాలు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయాయని.. ఈ తరుణంలో కల్చరల్ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ నిర్వహణ సంఘం అధ్యక్షుడు కింగ్ జాన్సన్ కొయ్యడ తెలిపారు. స్కోవా కల్చరల్ బృందానికి చెందిన సురేష్, నవీన్, జ్యోత్స్న, లలితా, ప్రసన్న తదితరులు కృషి వల్ల ఈ కార్యక్రమం ఆద్యంతం అద్భుతంగా జరిగిందన్నారు. ప్రతిఏటా ఇలాంటి కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆరంభించారు. మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సెక్టార్ ఎస్ఐ గిరిష్, స్కోవా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.