ఆస్తి, ప్రాణ నష్టం జరగొద్దు

72

హైదరాబాద్, సెప్టెంబర్ 27: గులాబ్ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ఏవిధమైన అస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశించారు.

సోమవారం సాయంత్రం జిహెచ్ఎంసి కమిషనర్, జోనల్ కమీషనర్లు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ తదితరులతో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యుల ఆదేశాల మేరకు భారీ వర్షాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా అర్వింద్ కుమార్ మాట్లాడుతూ, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలకు వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి లోతట్టు ముంపు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. ఇప్పటికే జోనల్ సర్కిల్ వారీగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులను తరలించాలని ఆదేశించారు. మొబైల్ అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు రాత్రిపూట కూడా భోజన సదుపాయం కల్పించాలని ఆదేశించారు.

నీటి నిల్వలను, విరిగిన చెట్లును తొలగించడం, కూలిన విధ్యుత్ స్తంభాలను తొలగించి విధ్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఏవిధమైన ఇబ్బందులు, సమస్యలు ఏర్పడ్డా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం 040 21111111 అనే నెంబర్ కు కాల్ చేయాలని నగర వాసులకు తెలియ చేశారు. జిహెచ్ఎంసి పరిధిలో అర్ అండ్ బి, వాటర్ వర్క్స్ పోలీస్ ఇరిగేషన్ శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు.

జిహెచ్ఎంసి పరిధిలో 195 మాన్సూన్ ఎమెర్జెన్సీ టీమ్ లు, 139 స్టాటిక్ టీమ్స్, ప్రతి లొకేషన్ లో ఇద్దరు చొప్పున ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. సిఅర్ఏంపి ద్వారా మరో 71 బృందాలు, 33 మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. 237 పంపు సెట్లను, జోన్ కు 2 చొప్పున బోట్స్, డి అర్ ఏం ద్వారా 8 బోట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 45 జేసిబిలు, విరిగిన చెట్లు నరికే 55 పవర్ కట్టింగ్ మిషన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జోనల్ సర్కిల్ స్థాయి లో పోలీస్, డిస్కాం, వాటర్ వర్క్స్ శాఖల టీమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here