మెలోడీ బ్రహ్మ మణిశర్మ బర్త్ డే స్పెషల్

47
Happy birthday Mani sarma
Happy birthday Mani sarma

Happy birthday Mani sarma

మణిశర్మ .. తెలుగు సినిమా సంగీతంలో ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది. మాస్ అండ్ క్లాస్ మిక్స్ చేసిన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గా తిరుగులేని పేరు ఉంది. ఓ దశాబ్ధంన్నర పాటు తెలుగు సినిమా సంగీతాన్ని శాసించిన రికార్డూ ఉంది. రీ రికార్డింగ్ లో మణి తర్వాతే ఎవరైనా అనే పేరూ ఉంది. కేవలం తన అద్భుతమైన సంగీతంతోనే ఇన్ని ప్రత్యేకతలు సంపాదించుకున్న మితభాషీ.. స్వరడ్యాషీ మణిశర్మ బర్త్ డే ఇవాళ.  మణిశర్మ జన్మించింది కృష్ణాజిల్లా మచిలీపట్నంలో. అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. ఆయన తండ్రి వయొలినిస్ట్. దీంతో చిన్నతనం నుంచే సంగీతం పై మక్కువ పెరిగింది. తండ్రి సినిమాల్లో పనిచేయాలని ఫ్యామిలీతో కలిసి మద్రాస్ వెళ్లారు. అక్కడే కీ బోర్డ్ తో పాటు పాశ్చాత్య సంగీతంలో ఇళయరాజాకు, రెహమాన్ కు ఇంకా చాలామందికి గురువైన జాకబ్ జాన్ దగ్గర మణిశర్మ పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు. మరోవైపు కర్ణాటక సంగీతంపైనా పట్టు సాధించాడు.

కీ బోర్డ్ ప్లేయర్ గా ఇళయరాజా, కీరవాణి, రాజ్ కోటిల వద్ద పనిచేశాడు. ఆసమయంలోనే అతనికి రామ్ గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే రామూ తను తీసిన రాత్రి అనే హారర్ సినిమాకు సంగీతం చేయించాడు. కానీ ఇందులో పాటలు లేవు. అయినా అంతం సినిమాలో మణితో ఒక పాటకు ఛాన్స్ ఇచ్చాడు. ఇదే మణిశర్మ తొలి సినిమా పాట. పూర్తి స్థాయి సంగీత దర్శకుడుగా మణిశర్మ తొలి సినిమా ఏవియస్ డైరెక్ట్ చేసిన సూపర్ హీరోస్. అదే టైమ్ లో ప్రేమించుకుందాం రా సినిమాలో మూడు పాటలు కంపోజ్ చేశారు. ఈ మూడూ మంచి గుర్తింపు తెచ్చాయి. దీంతో ప్రేమించుకుందాం రా దర్శకుడు జయంతే తర్వాత మెగాస్టార్ తో చేసిన బావగారూ బాగున్నారా చిత్రానికి ఛాన్స్ ఇచ్చాడు.

బావగారూ బాగున్నారాతో మణి శకం మొదలైందనే చెప్పాలి. ఈ సినిమాలోని అన్ని పాటలూ హిట్. ఆ తర్వాత వెంకటేష్ గణేష్ కూడా సూపర్ హిట్. దీంతో చిరంజీవి మణిని ఇంకా ఎంకరేజ్ చేశారు. చూడాలని ఉంది సినిమా మూవీకీ అవకాశం ఇచ్చాడు. అలా తొలి దశలోనే మెగా మూవీస్ తో మెస్మరైజింగ్ మ్యూజిక్ తో మెప్పించి టాప్ నోట్ లో దూసుకుపోయాడు మణిశర్మ. మణిశర్మ మ్యూజిక్ టాలీవుడ్ మొత్తంలో టాప్ లేపిన సినిమా సమరసింహారెడ్డి. అంతకు ముందే మనసిచ్చి చూడు సినిమాకు పనిచేస్తోన్నప్పుడు నిర్మాత ఎడిటర్ మోహన్ మణికి మెలోడీ బ్రహ్మ అనే బిరుదు ఇచ్చాడు. దాన్ని నిలబెట్టుకుంటూనే సమరసింహారెడ్డి రీ రికార్డింగ్ తో టాలీవుడ్ లో ఓ కొత్త ట్యూన్ కు బీజం వేశాడు మణిశర్మ. సమరసింహారెడ్డి ఆర్ఆర్ ఎప్పుడు విన్నా రోమాంచితంగానే ఉంటుంది. మణిశర్మ ఎంట్రీ ఇచ్చే నాటికి రాజ్ కోటి విడిపోయి ఉన్నారు. కీరవాణి మాత్రమే హవా చేస్తున్నాడు. మణి మ్యూజిక్ కీరవాణికి పూర్తి భిన్నంగానూ అప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగానూ కనిపించడంతో కొన్నాళ్ల పాటు టాలీవుడ్ అంతా మణి వాటుగా వెళ్లిపోయింది. అయితే మణి మ్యూజిక్ ఏ దశలోనూ ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు.

మణిశర్మ సంగీతానికి టాలీవుడ్ ఫిదా అయిపోయింది. బెస్ట్ మ్యూజిక్ ను ఫాస్ట్ గా ఇస్తాడు అన్న పేరు రావడంతో దర్శక నిర్మాతలంతా మణి ఉంటే చాలు అనుకున్నారు. అటు మెగాస్టార్ కు ఫేవరెట్ అయితే.. మినీ స్టార్స్ అంతా మణి మ్యూజిక్ చేస్తే బావుండు అని ఫీలయ్యారు. అలా అప్పుడే వస్తోన్న స్టార్స్ నుంచి ఆల్రెడీ ఉన్న టాప్ స్టార్స్ వరకూ మణిశర్మ సంగీతం అన్ని సినిమాలకు ప్లస్ అవుతూ వచ్చింది. మణిశర్మ పీక్స్ లో ఉన్న టైమ్ లోనే దేవీ శ్రీ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. అటు కీరవాణి సైతం దుమ్మురేపుతున్నాడు. అయినా మణిశర్మ సంగీతం చేస్తున్నాడు అంటే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా అతనికి బాగా కలిసొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ ను యూత్ ఐకన్ చేసిన ఖుషీ సినిమా సంగీతం, పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఖుషీ తర్వాత వీరి కాంబోలో ఆ రేంజ్ లో ఆల్బమ్ మళ్లీ రాలేదనే చెప్పాలి.

ఒక్క చిరంజీవికే పది సినిమాలకు సంగీతం అందించాడు మణిశర్మ. అటు బాలయ్యకూ ఏడెనిమిది సినిమాలున్నాయి. అలాగే మహేష్ కెరీర్ ను మార్చిన ఒక్కడు, పోకిరిలో మణి ఆర్ఆర్ లేకుండా ఊహించలేం. అలాగే ఈ సినిమాల్లోని పాటలు కూడా సూపర్ హిట్. విశేషం ఏంటంటే.. చిరంజీవి తర్వాత మణి మ్యాజికల్ మ్యూజిక్ ఎక్కువగా మహేష్ సినిమాల్లోనే వినిపిస్తుంది.
1998లో కెరీర్ మొదలుపెట్టిన మణిరత్నం సరిగ్గా పదేళ్ల పాటు తెలుగు సినిమా సంగీతాన్ని శాసించాడనే చెప్పాలి. ఆ పదేళ్లలో ఎందరో కొత్త సంగీత దర్శకులు వచ్చారు. కానీ మణికి గట్టి పోటీ ఇవ్వలేదు అనేది నిజం. పెద్ద పోటీ లేదు అని కాదు కానీ.. తనదైన శైలిలో ప్రతి సినిమాకూ బెస్ట్ ఇవ్వాలన్న తాపత్రయమే మణిని ఎందరో అభిమానించేలా చేసిందని చెప్పొచ్చు. ఎంతటి వారికైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ దశాబ్ధంలో కొత్త సంగీత కెరటాలు వచ్చాయి. దీనికి తోడు 2010 తర్వాత మణి మ్యాజిక్ పెద్దగా కనిపించలేదు అనే కమెంట్స్ కూడా ఉన్నాయి. అయినా కొత్త స్టార్స్ తోనూ సరికొత్త మ్యూజిక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మధ్యలో నాని హీరోగా నటించిన జెంటిల్మన్ సినిమా విజయంలో మణిశర్మ సంగీతానిదే మేజర్ రోల్ అంటే కాదనలేం కదా..

కొత్త ట్యూన్స్ వస్తన్నప్పుడు పాత ట్యూన్స్ కాస్త గ్యాప్ తీసుకుంటాయి. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. అందుకే రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న మ్యూజిక్ తో అదరగొట్టాడు. ఈ మూవీ రీ రికార్డింగ్ సైతం మైండ్ బ్లోయింగ్ అనేశారు. ఈ కాలపు యువతను ను ఇస్మార్ట్ గా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ పాటలేని ఫంక్షన్ లేదంటే అతిశయోక్తి కాదు. మధ్యలో ఎక్కడో లైన్ తప్పి ఉండొచ్చేమో.. కానీ మణి సంగీతం ఎప్పుడూ డిజప్పాయింట్ చేయలేదు. చాలా సినిమాలు మంచి ఆల్బమ్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద పోయాయి. కానీ ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ మణి శకం మొదలైంది. చెబితే ఆశ్చర్యపోతారు కానీ.. ఇప్పుడు మణి చేతిలో చిరంజీవి ఆచార్యతో కలిపి తొమ్మిది సినిమాలున్నాయి. సక్సెస్ ఉంది. కానీ క్రేజ్ తగ్గింది అనుకున్నవాళ్లకు ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ సమాధానం చెప్పాడు మణిశర్మ. అందుకే ఇప్పుడు హిస్టరీ రిపీట్ అవుతోంది. మళ్లీ అతని కోసం స్టార్స్ కూడా ఎదురుచూసేలాంటి టైమ్ రాబోతోందని తన చేతిలో ఉన్న తొమ్మిది సినిమాలే చెబుతున్నాయి. మరి ఈ తరానికి కూడా తన స్టైల్లో మరింత బెస్ట్ మ్యూజిక్ తో అలరించాలని కోరుకుంటూ ఈ మెలోడీ కింగ్ కు మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here