పవన్ కళ్యాణ్ ఓ ప్రభంజనం..  

55
HAPPY BIRTHDAY PAWAN
HAPPY BIRTHDAY PAWAN

HAPPY BIRTHDAY POWER STAR

పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడుగా పరిశ్రమలోకి వచ్చి ఒక తరంతో పవన్ కళ్యాణ్ అన్నయ్యే చిరంజీవి అనిపించుకున్న స్టార్. భిన్నమైన ఆలోచనా ధోరణి ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ విజయాలు తక్కువే. కానీ సాధించిన విజయాల్నీ ట్రెండ్ సెట్ చేసినవే. ఈ కారణంగానే అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఒకవైపు నటన చేస్తూనే.. దర్శకుడుగా ఆకట్టుకున్నాడు. ఫైట్స్, డ్యాన్స్  కంపోజ్ చేయగలడు. పాటలూ పాడతాడు. ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చిన  ఈ గబ్బర్ సింగ్ పుట్టిన రోజు నేడు.
చిరంజీవి మెగాస్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైమ్ లోనే తన రెండో సినీ వారసుడిగా కళ్యాణ్ బాబును రంగంలోకి దించాడు. చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపించిన పవన్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు మెగా అభిమానులు. వారి కోసమే కాకుండా ఇండస్ట్రీకి తానేంటో నిరూపించాలనే తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో అదిరిపోయే మార్షల్ ఆర్ట్స్, రియల్ స్టంట్స్ చేసి వారెవ్వా అనిపించాడు పవన్. ఆ పై గోకులంలో సీత అంటూ సాఫ్ట్ స్టోరీ చేసీ మెప్పించాడు.. చిరంజీవి ప్రాభవాన్న మరీ ఎక్కువగా వాడుకోలేదు కానీ.. కథల ఎంపికలో ఆయన ప్రమేయం ఉంది.

తొలి రెండు సినిమాలతో ఇండస్ట్రీని ఆకట్టుకున్నా.. కమర్షియల్ గా అద్భుతమైన విజయాలైతే కాదు. మూడో సినిమా సుస్వాగతం. ఓ తమిళ చిత్రానికి అనువాదంగా వచ్చిన మూవీ. సినిమా హిట్ అయింది కానీ. తర్వాత వచ్చింది.. పవన్ అంటే పిచ్చిపట్టేలా అభిమానించే సినిమా. పవన్ ను తమ ఆరాధ్య నాయకుడిగా మార్చుకున్న సినిమా అది. అలాంటి సినిమా ఒక్కసారైనా చేయాలని.. ఎంతో మంది హీరోలు.. దర్శకులు కలలు కంటోన్న సినిమా అది. అదే తొలి ప్రేమ. తొలి ప్రేమలోని మాధుర్యాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన సినిమా అని అందరూ అనుకుంటారు.. కానీ ఆ మాధుర్యాన్ని తన నటనతో ప్రతి కుర్రాడు తనను తాను చూసుకునేలా చేశాడు పవన్.. అందుకే ఆ సినిమా అంత స్పెషల్ అయింది.. లక్షలమంది కుర్రాళ్లు పవన్ అంటే పడిచచ్చేంత అభిమానానికీ కారణమైంది. పవన్ కళ్యాణ్ ముందు నుంచీ భిన్నమైన ధోరణిలోనే ఉండేవాడు. కామ్ గోయింగ్. సినిమాల్లో కనిపించే హడావిడీ అతని లైఫ్ స్టైల్ లో కనిపించదు. అభిమానులు పెరుగుతున్నా అతనిలో అహంకారం పెరగలేదు. అది ఫ్యాన్స్ కు ఇంకా బాగా నచ్చింది. తనకు తెలిసిన అన్ని విద్యలను వెండితెరపై ప్రదర్శించడం పవన్ స్టైల్. తమ్ముడు, జానీ సినిమాల్లో జానపద శైలిలో పాడినా.. బద్రిలో రెండు పాటలకు డ్యాన్స్  కంపోజింగ్  చేసుకున్నా అది అవి తనకు నచ్చితేనే చేసుకున్నాడు.

చిరంజీవి తమ్ముడుగా కాకుండా తొలి ప్రేమతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు పవన్. ఇక తమ్ముడు సినిమా తర్వాత ఎంతో మంది కుర్రాళ్లు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. క్లైమాక్స్ ఫైట్ లో పవన్ చేసిన స్టంట్స్ టాలీవుడ్ కే కొత్తగా అనిపించాయి.. తొలిప్రేమతో అతన్ని అభిమానించడం మొదలుపెట్టిన ఎంతో మందికి అతని మేనియా సోకింది మాత్రం ఖుషీతోనే. కాలేజ్ స్టూడెంట్ గా పవన్ చేసిన ఖుషీ టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలోనే పూర్తిగా హిందీ లిరిక్స్ తో పాట పెట్టి ఆశ్చర్యపరిచాడు. సిద్దూ సిద్ధార్థ్ రాయ్.. బెంగాల్ టైగర్ అంటూ పవన్ చెప్పిన డైలాగులు కుర్రకారును ఊపేశాయి. ఫస్ట్ మూవీ నుంచి తరచి చూస్తే పవన్ లో ఓ మంచి టెక్నీషియన్ కూడా కనిపిస్తాడు. మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్ పర్ట్ కావడమే కాదు.. వాటిని పిక్చరైజ్ చేయడంలోనూ అతని ప్రతిభ కనిపిస్తుంది. అందుకేనేమో ఈ నేపథ్యంలో కథ రాసుకుని చాలా త్వరగా మెగాఫోన్ పట్టుకున్నాడు. ఖుషీలాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత పవన్ కాన్ఫిడెన్స్ పెరిగిందో లేక, ఎప్పటి నుంచో అనుకుంటున్న దానికి అదే సరైన టైమ్ అనుకున్నాడో కానీ, సడెన్ గా మెగా ఫోన్ పట్టేశాడు. జానీ సినిమాతో దర్శకుడిగా మారాడు. బద్రి బ్యూటీ రేణుదేశాయ్ హీరోయిన్ గా.. మొదలైన ఆ సినిమా విడుదలయ్యేంత వరకూ నిత్యం వార్తల్లో సంచలనంగానే ఉంది. కానీ పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ నేపథ్యంలో వచ్చిన జానీ రిజల్ట్ నిరుత్సాహపరిచింది. ఈ విషయంలో అటు అభిమానులే కాదు, పవన్ కూడా చాలా డిజప్పాయింట్ అయ్యాడు.

పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. జానీ పోయినా అది తగ్గలేదు. కానీ జానీతో మొదలైన పరాజయ పరంపర అదే పనిగా కొనసాగింది. ఈ ఫీల్డ్ లో జయాపజయాలు ఎవరికైనా కామన్.. కానీ పవన్ కు కాదు అన్నట్టుగా ఫ్లాపులు పట్టుకున్నాయి. ఆశ్చర్యంగా ఎన్ని ఫ్లాపులు వస్తున్నా పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అతని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్యాడ్ ఫేజ్ అది. గబ్బర్ సింగ్ కు ముందు వరకూ జల్సా ను మినిహాయిస్తే ఎనిమిది ఫ్లాపులు అతని ఖాతాలో ఉన్నాయి.. జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం, కొమురం పులి, తీన్ మార్, పంజా.. ఇలా అన్నీ ఫ్లాపులే. కానీ ఒకటీ రెండు సినిమాలకు తప్ప ఏ నిర్మాతా పెద్దగా నష్టపోలేదు. అయితే హిట్ కోసం పవన్ చేయని ప్రయత్నమే లేదు. యాక్షన్ నుంచి అన్నవరం లాంటి సిస్టర్ సెంటిమెంట్ సినిమాల వరకూ.. హీరోయిన్ లేని బంగారం నుంచి మాఫియా డాన్ లాంటి పంజా వరకూ ఎన్నో ప్రయోగాలు చేశాడు.

దాదాపు పదేళ్ల తర్వాత పవన్ కు అతని స్థాయికి తగ్గ హిట్ వచ్చింది. 2012లో వచ్చిన ఆ కలెక్షన్ సునామీ గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టి కురిపించింది.. అన్ని రికార్డులను తిరగరాసింది. తర్వాత బద్రి కాంబినేషన్ లో పూరీ జగన్నాథ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేశాడు.కానీ అది కాస్తా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ పవన్ లోని ఫైర్ ను మాత్రం అంతో ఇంతో చూపించగలిగాడు పూరీ. మరోవైపు వివాదాలు కూడా ఆ సినిమా పరాజయానికి కారణంగా నిలిచాయి. ఇక 2013లో వచ్చిన అత్తారింటికి దారేదీ మరో బ్లాక్ బస్టర్ అయింది. మళ్లీ అన్ని రికార్డులను తుడిచిపెట్టేసిందా సినిమా. విడుదలకు ముందే గంటన్నర సినిమా పైరసీకి గురైనా అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసిందంటే కారణం పవన్ కళ్యాణ్ క్రేజే. ఇక అత్తారింటికి దారేదీ క్లైమాక్స్ లో తన ఇమేజ్ భిన్నమైన నటనతో తొలిప్రేమ తర్వాత ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాడు పవన్. రాజకీయంగా అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువనేతగా కీలక బాధ్యతలే చూసుకున్నాడు పవన్. కానీ ప్రజారాజ్యం అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడం, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో అన్నయ్యతోనే విభేదించాడు. మధ్యలో ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్ తో విడాకులు.. మళ్లీ పెళ్లి చేసువడం వంటివి ఎంతో మందిని ఆశ్చర్యపరిచాయి. చివరగాగా తనే జనసేన పార్టీని స్థాపించి.. రియల్ పవర్ స్టార్ అనిపించుకున్నాడు. పార్టీ స్థాపించిన తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాడు.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. అన్నిటినీ మౌనంగా భరిస్తూనే సినిమాలూ చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ కామెడీ చేశాడు. కాటమరాయుడు అంటూ సీరియల్ లవ్ స్టోరీ చేశాడు. కానీ ఇవేమంత పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. బట్ కమర్షియల్ గా ఇబ్బందులేమీ రాలేదు. కాటమరాయుడుపై చాలా నమ్మకం పెట్టుకున్న పవన్ మళ్లీ తన మిత్రుడు త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేశాడు. అజ్ఞాతవాసి. అంతకు ముందు వరకూ తెలుగులో ఈ స్థాయి అంచనాలు మరో సినిమాకు రాలేదు. అలా వచ్చిన అంచనాలను అందుకోవడంలో అజ్ఞాతవాసి ఫెయిల్ అయ్యాడు. కమర్షియల్ గా కూడా భారీ లాస్. దీంతో ఇక సినిమాలకు కామా పెట్టి.. ప్పినట్టుగానే 2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశాడు. తను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. పార్టీ నుంచి కూడా ఒకే అభ్యర్థి గెలుచుకున్నాడు.

అయినా నిరాశ పడకుండా నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళతానంటూ ప్రస్తుతం ప్రజా క్షేత్రంలోనే ఉన్నాడు. సినిమా అనేది అంత సులువుగా వదులుకునే ప్యాషన్ కాదు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా అటు పాలిటిక్స్ లోనే ఉంటూ.. మళ్లీ సినిమాలు చేస్తున్నాడిప్పుడు. ఇప్పటికే వకీల్ సాబ్ చివరి దశలో ఉంది. క్రిష్, హరీశ్ శంకర్ తో పాటు మరో సినిమా కూడా ఆల్రెడీ అనౌన్స్ అయింది. వీటిలో వకీల్ సాబ్ వచ్చే సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. అటుపై 2021లో మరో రెండు సినిమాలూ విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తంగా పొలిటికల్ గా కొంత ఇబ్బందులు పడ్డా.. హీరోగా పవన్ కళ్యాణ్ కు ఎప్పటికీ తిరుగుఉండదనే చెప్పాలి. మరి ఈ మాట నిజమా కాదా అనేది రాబోయే ఈ సినిమాలు చెబుతాయి. ఆ మేరకు వచ్చే ఈ సినిమాలన్నీ మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఈ పవర్ స్టార్ కు మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం.

వై.బి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here