HARISHRAO WITH MEDIA
- సీఎం కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది తూచా తప్పకుండా చేస్తా
- మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టీకరణ
తెలంగాణ మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పష్టంచేశారు. సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరారు. మంగళవారం రాజ్ భవన్ లో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారానికి హరీశ్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. వారంతా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి, సీఎం కేసీఆర్ కు చేదోడువాదోడుగా ఉండాలని ఆకాంక్సించారు. మంత్రిగా తనకు అవకాశం రాకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. తాను ముందు నుంచి చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడి లాంటి కార్యకర్తనని, సీఎం కేసీఆర్ ఏది ఆదేశిస్తే, దానిని తూచా తప్పకుండా చేస్తానని స్పష్టంచేశారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న అంశాలన్నీ నిజం కాదన్నారు. తనకు సోషల్ మీడియాలో ఎలాంటి ఖాతాలు లేవని, తనపేరుతో ఎలాంటి గ్రూపులు, సంఘాలు కూడా లేవని తెలిపారు.