He was forced to Tie Knocks and torture . కేసు నమోదు
సమాజంలో మహిళలు అడుగడుగునా వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ప్రేమించమని కొందరు, పెళ్లి చేసుకోమని కొందరు, పెళ్లి చేసుకున్న తర్వాత వేధింపులకు గురిచేస్తూ మరికొందరు మృగాళ్లు మహిళలకు నరకం చూపిస్తూనే ఉన్నారు. మహిళా సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు రక్షణ మాత్రం కరువు గానే ఉంది. ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్న ఉదంతాలు మహిళలపై జరుగుతున్న హింసను తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా బలవంతంగా పెళ్లి చేసుకుని, ఆరునెలలు కాపురం చేసిన తరువాత, అనుమానంతో వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ ఓ భార్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
తన మెడలో బలవంతంగా తాళి కట్టి.. ఆరు నెలలు కాపురం చేసి ఇప్పుడు వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ యువతి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్‌కు చెందిన యువతి(19)ని అంబర్‌పేటకు చెందిన అనిల్(24) ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఒక రోజు గుడికి వెళ్దామని చెప్పి యువతిని జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి తీసుకెళ్లాడు. అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న తాళిబొట్టును యువతి మెడలో కట్టాడు. దీంతో యువతి షాక్‌కు గురైంది. చేసేదేమీ లేక సదరు యువతి అనిల్‌తో ఉంటూ కాపురం చేస్తోంది. అయితే పెళ్లి చేసుకుని ఆరు నెలలు గడవకముందే.. అనిల్ ఆమెపై అనుమానం తో ప్రతి రోజు మద్యం తాగి వచ్చి ఆ యువతిని చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు. అనిల్ చర్యలతో విసిగివేసారిన బాధిత యువతి.. పుట్టింటికి వెళ్లింది. అయినప్పటికీ వేధింపులు ఆపకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు అనిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.