Saturday, September 14, 2024

వచ్చే ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్​కు అరెంజ్​అలర్ట్

ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్‌ జోన్‌ ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ కరీంనగర్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. నేడు సాయంత్రం హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.

మరోవైపు ఇవాళ సాయంత్రం హనుమకొండలో భారీ వర్షం కురిసింది. హనుమకొండ వరంగల్, కాజీపేటల్లో కురిసిన వర్షంతో రహదారులు జలమయమైయ్యాయి. రోడ్లపైకి వాన నీరు వచ్చి చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. నగరంలోని బస్టాండ్​లోనూ వర్షపు నీరు చేరడంతో ప్రయాణీకులు ఇక్కట్లు పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానూ పలు చోట్ల వర్షం కురిసింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. కాటారంలో 111.3 మిల్లీమీటర్లు, మహాదేవపూర్​లో 110 మిల్లీమీటర్లు, మలహార్ రావు మండలం లో 106.5 మిల్లీమీటర్ల మేర భారీ వర్షం పడింది. భారీ వర్షానికి కాటారం మండలం రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి అంగన్వాడి కేంద్రంలోకి వరదనీరు చేరింది. గూడూరు బ్రిడ్జి కోతకు గురై పంటపొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. కాటారం నుంచి మేడారం వెళ్లే రహదారి పోతులవాయి వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు ఇబ్బందులు అయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular