Hero Gold Accused Building was leased for Home Minister WHY ?
హోంమంత్రి కుమారుడికి లీజ్ కి ఇచ్చింది అందుకే
తన ఆస్తులు కాపాడుకోవడం కోసం వివాదాస్పద హీరా గోల్డ్ యజమానురాలు నౌహీరా షేక్ తెలంగాణ హోంమంత్రి మహ్మద్ ఆలీ కుమారుడికి తన భవనాన్ని లీజుకు ఇచ్చినట్లు డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఇది తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. నౌహీరా నుంచి హోంమంత్రి మహ్మద్ ఆలీ కుమారుడు మహ్మద్ అజామ్ ఆలీ ట్రస్ట్ పేరుతో లీజుకు తీసుకున్న అంశం వెలుగులోకి రావటంతో ఒక్కసారిగా అధికార పార్టీ లో చర్చ మొదలైంది . హోంమంత్రి మహ్మద్ ఆలీ ఆ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. నౌహీరా వ్యవహారం వెలుగులోకి రావడంతో లీజును రద్దు చేసుకున్నారు. ఆ భవనంలో 9 షాపులు హీరోగోల్డ్ కంపెనీ పేరుమీద ఉన్నాయి. వాటిని 2017 జనవరి 24న నౌహీరా షేక్ నుంచి మహ్మద్ అజామ్ ఆలీ లీజుకు తీసుకుంటున్నట్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. 6లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చి, నెలకు 30వేలు చెల్లించే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే నౌహీరా షేక్‌పై అప్పటికే పోలీస్ స్టేషన్‌లో కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆమెపై విచారణ జరపాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గతంలో సీసీఎస్‌లో పిర్యాదు చేశారు. 2014లోనే 200 కోట్ల రూపాయల హవాలా కేసు పెండింగ్‌లో ఉండగా దానిపై విచారణ జరుగుతోంది. ఇలాంటి సమయంలో వారు అగ్రిమెంట్ చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ట్రస్టు భవనం పేరు మీద కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో నౌహీరా షేక్ 5 కోట్లు రుణం తీసుకున్నారు. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఆ భవనాన్ని బ్యాంక్ స్వాధీనం చేసుకుంటామంటూ పత్రికలో ప్రకటన కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ స్వాధీనం నుంచి తప్పించుకునేందుకు నౌహీరా షేక్ ఎత్తుగడ వేస్తూ హోంమంత్రి కుమారుడికి లీజుకు ఇవ్వడం ద్వారా ఆస్తులు రక్షించుకోవచ్చుననే ఆలోచన చేస్తూ భవనం లీజుకు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.