హైబీపీకి సంగీత సాంత్వన

High Blood Pressure Music Therapy

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? అయితే మందులతో పాటు కాస్త శాస్త్రీయ సంగీతం కూడా వినండి. ఇలా చేయటం వల్ల రక్తపోటు మరింత బాగా తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. హైబీపీతో గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్ర సమస్యల ముప్పు పెరుగుతుంది. అందుకే దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం మంచిది. ఆహారం, వ్యాయామం వంటి జీవనశైలి మార్పులతో రక్తపోటు తగ్గకపోతే డాక్టర్లు మందులు సూచిస్తుంటారు. అయితే వీటిని వేసుకున్న తర్వాత శాస్త్రీయ సంగీతం వింటే రక్తపోటు మందుల ప్రభావం గణనీయంగా పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. సంగీతం విన్న తర్వాత గుండె కొట్టుకునే వేగం నెమ్మదించటమే కాకుండా రక్తపోటు మరింత బాగా తగ్గుతున్నట్టు బయటపడింది.  ఈ అధ్యయనంలో భాగంగా రక్తపోటు మందులు వేసుకున్న తర్వాత ఒకరోజు ఇయర్ ఫోన్స్ ద్వారా 60 నిమిషాల సేపు వాయిద్య సంగీతాన్ని వినిపించారు. మరో రోజు సంగీతం వినిపించకుండా పరిశీలించి చూశారు. సంగీతం విన్నప్పుడు గుండె వేగం, రక్తపోటు గణనీయంగా తగ్గినట్టు తేలటం విశేషం.  పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సంగీతం ప్రేరేపిస్తుండటమే దీనికి కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే సంగీతం జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేసి మందులను శరీరం మరింత బాగా గ్రహించుకునేలా చేస్తోందనీ అనుకుంటున్నారు.
రక్తపోటు నియంత్రణలో ఉండటంలో తీసుకునే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల తినే పదార్థాల మీదా దృష్టి పెట్టటం మంచిది.
1. అరటిపండ్లు
వీటిల్లో సోడియం మోతాదులు తక్కువ. పైగా రక్తపోటు తగ్గటానికి తోడ్పడే పొటాషియం స్థాయులు ఎక్కువగానూ ఉంటాయి. అందువల్ల అరటిపండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిది.
2. పాలకూర
ఇందులో కేలరీలు తక్కువ. పీచు ఎక్కువ. పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఇవన్నీ రక్తపోటు తగ్గటానికి, నియంత్రణలో ఉండటానికి తోడ్పడతాయి.
3. ఓట్ మీల్
పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు, పొట్టు తీయని ధాన్యాలు రక్తపోటు నియంత్రణలో ఉండటానికి తోడ్పడతాయి. అందువల్ల ఓట్స్, దంపుడు బియ్యం వంటివి తీసుకోవటం మంచిది. వీటితో త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. వెంటనే ఆకలి వేయదు కూడా. ఇలా ఇవి బరువు తగ్గుముఖం పట్టేలా చేస్తాయి. బరువు అదుపులో ఉంటే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.

గర్భిణులూ.. నొప్పి మాత్రలతో జాగ్రత్త
గర్భధారణ సమయంలో ఆహార, విహార పరంగా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతుంటారు. సొంతంగా మందులు వేసుకోవటం తగదనీ సూచిస్తుంటారు. ముఖ్యంగా నొప్పి మందులు వేసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. ఇది గర్భిణుల మీదనే కాదు, వారికి పుట్టిన పిల్లల మీదా ప్రభావం చూపుతుంది. గర్భధారణ సమయంలో నొప్పి మందులు వేసుకున్నవారికి పుట్టిన పిల్లలకు పెద్దయ్యాక సంతాన సమస్యలు తలెత్తే అవకాశమున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ప్యారాసిటమాల్ సహా ఇతరత్రా నొప్పి మందులు పిల్లల డిఎన్ఎ మీద చెరగని ముద్ర వేస్తున్నాయని, ఇది భవిష్యత్తులో సంతాన సమస్యలకు దారితీస్తోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గర్భం ధరించినప్పుడు నొప్పి మందుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండటం అవసరమని చెబుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article