High Court Shocks To AP Govt Over 3 Capitals
ఏపీ హైకోర్టులో రాజధాని తరలింపుపై కీలక వాదనలు చోటుచేసుకున్నాయి. రాజధాని తరలింపుపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ స్థలం సరిపోకపోతే ఇక్కడే వేరే భవనంలోకి మార్చకుండా వేరే ప్రాంతానికి ఎందుకు మార్చుతున్నారో అఫిడవిట్ ఇవ్వాలని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ప్రస్తుత సచివాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు.. వారికి ఎంత స్థలం ఉందో తెలియజేయాలని స్పష్టం చేసింది. విజిలెన్స్ హెడ్ ఆఫీస్ ఒక చోట, మిగతా స్టాఫ్ మరోచోట ఉంటే విధులు ఎలా నిర్వహిస్తారో తెలియజేయాలని ఆదేశించింది. విజిలెన్స్ కమిషన్, జీఎడీ.. రెండూ ఎలా వేర్వేరో వివరించాలంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. మరోవైపు రాజధాని తరలింపు, కార్యాలయాల తరలింపు అంశాలపై మాత్రమే ముందుకెళ్లాలని పిటిషనర్లకు ధర్మాసనం సూచించింది. ప్రభుత్వ సలహాదారుల వ్యాఖ్యలు, అధికారుల సర్వీసు రూల్స్ ఉల్లంఘన లాంటి అంశాలను ఈ పిటిషన్లలో కలపడం ఎందుకని ప్రశ్నించింది. అయితే సలహాదారులు కోర్టులపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. ఎవరేం మాట్లాడుతున్నారో అన్నీ తమ దగ్గర ఉన్నాయని, న్యాయవ్యవస్థ హుందాతనం ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.