కోల్ కతాలో హైడ్రామా

HIGH DRAMA IN KOLKATA

  • సీపీని విచారించడానికి వచ్చిన సీబీఐ
  • అడ్డుకున్న పోలీసులు.. సీపీకి మమత బాసట
  • కేంద్ర వైఖరికి నిరసనగా ధర్నా

కేంద్రానికి, బెంగాల్ సర్కారుకు మధ్య వార్ మరింత ముదిరింది. ఆదివారం కోల్ కతాలో హైడ్రామా చోటుచేసుకుంది. రోజ్‌ వ్యాలీ, శారదా పోంజీ కుంభకోణాల కేసుల్లో విచారణ జరుపుతున్న సీబీఐ.. ఇందుకు సంబంధించి కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను విచారించడానికి ఆదివారం సాయంత్రం ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే, సీబీఐ అధికారులను లోనికి వెళ్లనివ్వకుండా కోల్ కతా పోలీసులు అడ్డుకున్నారు. రాజీవ్‌ను విచారించేందుకు కావాల్సిన సంబంధిత పత్రాలు ఉన్నాయా? అంటూ సీబీఐ బృందాన్ని నిలదీశారు. అక్కడి నుంచి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ వెంటనే రాజీవ్‌ కుమార్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తమపై కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండానే పోలీస్‌ కమిషనర్‌ ఇంటికి వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ.. మోదీ, షా చేతుల్లో తనకు అవమానం జరిగిందని పేర్కొంటూ కోల్‌కతాలో పేరొందిన మెట్రో సినిమాకు ఎదురుగా రాత్రి ధర్నాకు దిగారు. కనిపించకుండా పోయారని వార్తలు వచ్చిన రాజీవ్‌కుమార్‌ తాజా ఘటనతో మళ్లీ ప్రత్యక్షమయ్యారు. మమతతోపాటు ఆయన కూడా ధర్నాలో కనిపించారు. శారద చిట్‌ఫండ్, రోజ్‌వ్యా లీ పోంజి కుంభకోణాల్లో రాజీవ్‌కుమార్‌ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారని సీబీఐ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

కాగా, రాజ్ కుమార్ ను బెంగాల్ సీఎం మమత వెనకేసుకొచ్చారు. ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ పోలీస్ అధికారి అని కితాబిచ్చారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మోదీ ఆదేశాల మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ రాజకీయ ప్రత్యర్థులపైకి సీబీఐని పంపుతున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విపక్షాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. అయితే, కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ను సీబీఐ ప్రశ్నించకుండా పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల్ని పరిహాసానికి గురిచేస్తోందని ఆరోపించింది.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article