ఆర్టీసీ విషయంలో వాస్తవాలు చెప్పాలన్న హైకోర్టు

HIGHCOURT SERIOUS ON RTC

ఆర్టీసీ సమ్మె పైన ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి డిసైడ్ చేసిన డెడ్ లైన్ ను కార్మిక సంఘాలు పట్టించు కోలేదు. నామ మాత్రంగానే కార్మికులు విధుల్లో చేరారు. దీంతో..ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా న్యాయపరంగా ఎటువంటి అడ్డంకులు రాకుండా.. అసలు ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్ధకంగా మారిందనే ఆధారాలతో కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది.ప్రభుత్వం వేసిన ఈ రివర్స్ గేర్ తో అసలు ఉద్దేశం ఏంటనేది స్పష్టమవుతోంది. ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.  సి ఎస్  ఎస్ కే జోషి,  ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ లు హైకోర్టుకు హాజరయ్యారు. అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సి ఎస్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆర్టీసీ, ఆర్థిక శాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయన్న హైకోర్టు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని పేర్కొంది.  అంతేకాదు  ఐఏఎస్ అధికారుల  అసమగ్ర  నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక రికార్డులను పరిశీలించిన తర్వాతే నివేదిక ఇచ్చామని కోర్టుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు  స్వయంగా కోర్టుకు వివరణ ఇస్తున్నారు. హైకోర్టు ధర్మాసనం మొదటి నివేదిక పరిశీలించకుండానే మరోమారు నివేదిక ఇచ్చారని ప్రశ్నించింది.  దీంతో సమయాభావం వల్ల రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని రామకృష్ణ రావు కోర్టుకు తెలిపారు. అంతేకాదు మన్నించాలని కోర్టును విన్నవించుకున్నారు. అయితే క్షమాపణ కోరడం సమాధానం కాదని వాస్తవాలు కోర్టుకు చెప్పాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు చెప్తున్న  లెక్కలకు, ఆర్టీసీ ఎండి  సునీల్ శర్మ ఇచ్చిన లెక్కలకు తేడా ఉందని వీటిలో తాము ఏ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలో  చెప్పాలని హై కోర్టు కోరింది. అయితే రామకృష్ణారావు కాగ్ నివేదిక అనుగుణంగా తయారు చేసిన పూర్తి నివేదికను వివరాలతో సహా తమకు అందించామని పేర్కొన్నారు.  హైకోర్టు ధర్మాసనం కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు చెబుతున్నారని  అసహనం వ్యక్తం చేసింది.  ఈ నివేదిక సైతం తప్పులతడకగా ఉందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.  రుణ పద్దుల కింద కేటాయించిన నిధులు అప్పు కాదని, ఏ బడ్జెట్లోనూ  అలా చూడలేదని  అభిప్రాయపడింది.ఇక అంతే కాదు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పైన హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. సునీల్ శర్మ తప్పుడు లెక్కలు  ఇస్తే ప్రభుత్వాన్ని మోసం  చేసినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.

చీఫ్ జస్టిస్ అడిగిన ప్రతి ప్రశ్నకు నివేదిక ఆధారంగా లెక్కలు చూపిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు  చాలా తెలివిగా సమాధానం చెబుతున్నారు కానీ కోర్టు మాత్రం  ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలో మరోమారు తప్పుల తడకల నివేదిక ఇచ్చిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.  మరి ఈ నేపథ్యంలో  కోర్టు  ప్రభుత్వ అధికారుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఈ కేసు వ్యవహారంలో  హైకోర్టు ధర్మాసనం ఏం చేయబోతుందో అనే ఉత్కంఠ  సర్వత్రా వ్యక్తమవుతోంది.

tags :  tsrtc strike, rtc strike,  rtc jac, telangana government,  court, CM KCR, RTC MD, Sunil sharma, finance department, cs ramakrishna rao, hearings , reports

http://tsnews.tv/twist-in-vijayaraddy-case/
http://tsnews.tv/balaya-clarity-on-mokshagna-entry/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *