Friday, July 5, 2024

మూడు చోట్ల హెచ్‌ఎండిఏ ల్యాండ్‌ఫూలింగ్

  • మూడు చోట్ల హెచ్‌ఎండిఏ ల్యాండ్‌ఫూలింగ్
  • భారీ ఆదాయానికి అధికారుల ప్రణాళికలు

హెచ్‌ఎండిఏ తాజాగా మేడ్చల్ జిల్లా పరిధిలోని ప్రతాపసింగారంలో ల్యాండ్‌ఫూలింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఉప్పల్ భగాయత్‌లో ల్యాండ్ ఫూలింగ్, భూముల వేలం ద్వారా భారీమొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకున్న హెచ్‌ఎండిఏ ల్యాండ్‌ఫూలింగ్ కింద రైతుల నుంచి భూములను సేకరిస్తోంది. దీనికి సంబంధించి హెచ్‌ఎండిఏ అధికారులు నోటిఫికేషన్‌ను సైతం జారీ చేశారు. ముఖ్యంగా హెచ్‌ఎండిఏ లే ఔట్‌లకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

రియల్‌ఎస్టే సంస్థలు, నిర్మాణ దారులు కూడా వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా హెచ్‌ఎండిఏ అధికారులు ప్రతాపసింగారంలో 131 ఎకరాలను సేకరించి అభివృద్ధి చేయడంతో పాటు, హెచ్‌ఎండిఏకు వచ్చే లేఔట్‌లోని ప్లాట్‌లను వేలం వేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొందరు రైతుల నుంచి అధికారులు భూముల సేకరణను సైతం ప్రారంభించారు.

లేమూరు 96 ఎకరాలు, యాలాలలో 88 ఎకరాలు…
ఉప్పల్ భగాయత్‌లో రైతుల నుంచి భూములను సేకరించిన హెచ్‌ఎండిఏ వాటిని అభివృద్ధి చేసి లే ఔట్‌లు వేసిన తర్వాత ఒక్కో రైతుకు ఎకరానికి వెయ్యి గజాల భూమి ఇచ్చింది. దాంతో పాటు భూములకు కొంతపరిహారం కూడా అందచేసింది. ఈసారి ప్రతాపసింగారంలో పరిహారంతో పాటు ఎకరానికి 1,742 గజాల అభివృద్ధి చేసిన భూమిని రైతులకు ఇవ్వాలని హెచ్‌ఎండిఏ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే రైతులు కూడా తమ భూములను హెచ్‌ఎండిఏకు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి హెచ్‌ఎండిఏ అధికారులు ప్లాట్‌లు చేస్తున్నారు.

ఈసారి సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని 150, 200, 300,400,500 గజాల సైజుల్లో ప్లాట్‌లను చేయాలని హెచ్‌ఎండిఏ అధికారులు నిర్ణయించారు. ఈసారి వేలం ద్వారా ఆశించిన స్ధాయిలో ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే రంగారెడ్డి జిల్లా లేమూరు 96 ఎకరాలు, యాలాలలో 88 ఎకరాలను ల్యాండ్‌ఫూలింగ్ కింద సేకరించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రతాపసింగారం, లేమూరు, యాలాలలో ల్యాండ్‌ఫూలింగ్ ద్వారా సేకరించిన భూములను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలను కల్పించి అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటే విధంగా ప్లాట్లను అందుబాటులోకి తీసుకు రావాలని హెచ్‌ఎండిఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular