టీకాలు వేసుకోనివారిలోనే ఆస్పత్రి చేరికలు

  • రెండు టీకాలూ తీసుకుంటే చాలా స్వల్ప లక్షణాలే
  • పిల్లల్లో ఒమిక్రాన్ కేసులు మరీ ఎక్కువగా లేవు
  • పురుషులు.. మహిళలు అందరికీ సమానమే
    హైదరాబాద్, జనవరి 22, 2022: కరోనాలో డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్‌తో ముప్పు చాలా తక్కువగానే ఉందని.. ముఖ్యంగా రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు దీని విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం అంతగా లేదని కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఫిజిషియన్ & డయాబెటాలజిస్ట్
    డా. ప్రవీణ్ కుమార్ కులకర్ణి తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రులలో చేరుతున్నవారిలో టీకాలు అసలు తీసుకోనివారు, లేదా ఒకడోసు మాత్రమే తీసుకున్నవారే ఉన్నారన్నారు. ఐసీయూ చేరికలు దాదాపు అవససరం రావట్లేదని చెప్పారు. డెల్టా వేరియంట్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారని, అదే ఒమిక్రాన్ మాత్రం ఇద్దరికీ దాదాపు ఒకేలా వస్తోందని విశ్లేషించారు. ప్రపంచ దేశాలన్నింటినీ పట్టి కుదిపేస్తున్న ఒమిక్రాన్.. మన దేశంలోనూ విస్తృతంగా వ్యాపిస్తోంది. రోజుకు 3.5 లక్షల వరకు కొవిడ్ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ పుట్టుపూర్వోత్తరాలు, అది ఎలా వ్యాప్తి చెందిందన్న విషయాలను డాక్టర్ ప్రవీణ్ కుమార్ కులకర్ణి వివరించారు.

2021 నవంబర్ 24న తాము బి.1.1529 అనే కొత్త సార్స్-కొవ్-2 వేరియంట్‌ను కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ)కు దక్షిణాఫ్రికా తెలిపింది. 2021 నవంబర్ 11న బోట్స్వానాలో, తర్వాత 2021 నవంబర్ 14న దక్షిణాఫ్రికాలో సేకరించిన నమూనాల్లో బి.1.1529ను గుర్తించారు.

ఆ తర్వాత విమాన ప్రయాణాల ద్వారా పలు యూరోపియన్ దేశాలు, భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్, ఇజ్రాయెల్, జపాన్, నైజీరియా, నార్వే, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ దేశాల్లోనూ ఒమిక్రాన్ బయటపడింది. 2021 నవంబర్ 26న సార్స్-కొవ్-2 వైరస్ పరిణామక్రమంపై సాంకేతిక సలహా మండలి (టాగ్-వీఈ)ని బి.1.1.529 తీవ్రత అంచనాకోసం నిర్వహించారు. దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (వీఓసీ)గా గుర్తించాలని టాగ్-వీఈ ప్రపంచ ఆరోగ్యసంస్థకు సూచించింది. దాంతో డబ్ల్యుహెచ్ఓ అలా గుర్తించడంతోపాటు దానికి ఒమిక్రాన్ అని పేరుపెట్టింది.

డబ్ల్యుహెచ్ఓ ఇలా వీఓసీగా వర్గీకరించడానికి ముందుగా దక్షిణాఫ్రికాలో ఇన్ఫెక్షన్లు గణనీయంగా పెరుగుతున్నప్పుడు సాంక్రమిక వ్యాధుల అధ్యయనం చేసింది. అప్పుడే ఒమిక్రాన్ బయటపడింది. ఒమిక్రాన్‌లో చాలా ఆందోళనకర స్పైక్ ప్రోటీన్ పదార్థాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇతర వేరియంట్లలోనూ ఉన్నాయి. అవి మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు లొంగకుండా, టీకాలనూ లెక్కచేయని రకాలుగా తెలిశాయి.

యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ కూడా ఈ వేరియంట్‌ను వీఓసీగా వర్గీకరించింది. అందుకు కారణాలు ఇలా చెప్పింది.. “ఇది డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ వ్యాప్తి చెందుతూ, రోగనిరోధక వ్యవస్థనూ తప్పించుకుంటోంది. ఒమిక్రాన్‌లోని స్పైక్ ప్రోటీన్ కనీసం 30 అమైనో యాసిడ్ పదార్థాలు, 3 చిన్న డిలిషన్లు, ఒక చిన్న ఇన్సర్షన్ ద్వారా రూపొందాయి. 30 అమైనో యాసిడ్ పదార్థాల్లో 15 రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (ఆర్బీడీ)లో ఉన్నాయి.

వ్యాప్తి: స్పైక్ ప్రోటీన్‌లో మార్పుల విశ్లేషణ ద్వారా, మొదటి సార్స్-కొవ్-2 వైరస్ కంటే ఒమిక్రాన్ వ్యాప్తి చాలా ఎక్కువని తెలిసింది. కానీ ఇంకా మరింత సమాచారం రావాల్సి ఉంది.

వ్యాధి తీవ్రత: ఒమిక్రాన్ వేరియంట్‌తో వ్యాధి తీవ్రత మరీ ఎక్కువ ఉంటుందా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఒమిక్రాన్ వల్ల అసాధారణ లక్షణాలు ఏమీ లేవు. ఇతర వేరియంట్లలాగే ఉన్నాయి. ఆస్పత్రులలో చేరడం, ఐసీయూ అవసరం, ఆస్పత్రులలో మరణాలు బాగా తగ్గినట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సలపై ప్రభావం: ఒమిక్రాన్ వేరియంట్‌పై మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సలు తగిన సామర్థ్యం చూపుతాయా లేదా అన్నదాన్ని అంచనా వేసేందుకు ఇంతవరకు తగిన సమాచారం లేదు. ఆర్బీడీలో కొద్దిపాటి మార్పులతో ఉన్న ఇతర వేరియంట్ల సమాచారం బట్టి చూస్తే, కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సలకు ఒమిక్రాన్ లొంగుతుంది గానీ, మిగిలినవి అంత ప్రభావం చూపవు.

టీకా వల్ల, ఇంతకుముందు వచ్చిన వ్యాధి వల్ల రక్షణపై ప్రభావం: టీకాలు తీసుకున్నవారు లేదా ఇంతకుముందు కొవిడ్ వచ్చినవారి విషయంలో ఒమిక్రాన్ రాకుండా ఉంటోందా అన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు.

టీకాల వల్ల వచ్చే రోగనిరోధకత ప్రధానంగా స్పైక్ ప్రోటీన్‌ను అడ్డుకుంటుంది. కానీ ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్‌లో ఎక్కువ మార్పులున్నాయి. ఆర్బీడీలో 15 మార్పులూ ఉన్నాయి. ప్రత్యామ్నాయాల సంఖ్య, అవి ఉన్న ప్రదేశం, ఇలాంటి స్పైక్ ప్రోటీన్ ప్రత్యామ్నాయాలే ఉన్న ఇతర వేరియంట్ల సమాచారాన్ని బట్టి చూస్తే టీకాలు తీసుకున్నవారు, లేదా ఇంతకుముందు కొవిడ్ వచ్చినవారికి ఉండే రోగనిరోధకత దీని విషయంలో కొంత తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ రోగనిరోధకత ఉన్నా ఒమిక్రాన్ సోకచ్చు.

టీకా సమర్ధత, బూస్టర్ డోసులు తీసుకున్నవారికి ఉండే రక్షణ, ఇంతకుముందు కొవిడ్ వచ్చినవారికి ఉండే రోగనిరోధకతలపై ప్రయోగశాలల్లో, ఇతరత్రా పరిశీలనలు చేయాల్సి ఉంది. అయితే టీకాలు తీసుకోవడం వల్ల ఆస్పత్రులలో చేరడం, మరణాలు తగ్గుతాయని, కొవిడ్-19 మహమ్మారి నియంత్రణలో టీకా కీలకపాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article