ఇల్లు కట్టిస్తున్న నియోజకవర్గ ప్రజలు

House Constriction by Constituency people

ఇల్లు లేని ఎమ్మెల్యే …

ఈ కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలంటేనే అంగ బలం అర్ధ బలం వుండాలి. బోలెడంత డబ్బు పెట్టుబడిగా పెట్టాలి. స్థిర, చర ఆస్థులు దండిగా ఉండాలి. అంతే కాదు జలగల్లా ప్రజా ధనాన్ని దోచుకునే వాళ్ళో, కబ్జా రాయుళ్లో, అక్రమ మార్గంలో సంపాదించిన వాళ్ళో మాత్రమే రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.కానీ ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే కడుపేద .. కనీసం ఇల్లు కూడా లేని వ్యక్తి … కానీ చాలా నీతి నిజాయితీలతో బ్రతికిన వ్యక్తి . ఇక ఇల్లు కూడా లేని ఆ ఎమ్మెల్యే కు ఇల్లు కట్టించాలని నిర్ణయించుకున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఎక్కడ ఏమిటి అంటే ఈ కథనాన్ని చదివెయ్యండి.
వివరాల్లోకి వెళ్తే..ఇటీవల మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో షియోపూర్ జిల్లా విజయ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీతారామ్ ఆదివాసి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి ఆయన దగ్గర ఇల్లు కూడా లేదు. ఉంటున్న గుడిసె కూడా ప్రజలు ఇచ్చిందే. సీతారామ్ ఆదివాసి ఎమ్మెల్యేగా గెల్చినప్పుడు ప్రజలంతా ఆయనకు తులాభారం వేశారు.. ఆ డబ్బులతో ఒక పూరి గుడిసె నిర్మించుకున్నారు. ఆ గుడిసెలో సీతారామ్ – ఆయన భార్య ఉంటారు. ఇప్పుడు సీతారామ్ కుటుంబం ఊరికి దూరంగా ఉన్న మురికివాడలో ఉంటోంది. ఆయన గుడిసె ఉన్న ప్రాంతం మొత్తం చెత్తతో ఉంటుంది. దీంతో.. నియోజక వర్గ ప్రజలు ఆయన కష్టాన్ని చూడలేకపోయారు. అందరూ చందాలేసుకుని మరీ ఇప్పుడు సీతారామ్ ఆదివాసికి రెండు గదుల ఇల్లు కట్టిస్తున్నారు. ఇంటికోసం రూ.100 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు.
ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వకముందు నుంచే సీతారామ్ ఆదివాసికి మంచి పేరుంది. చాలా క్రమశిక్షణ – నిజాయితీ గల వ్యక్తిగా సీతారామ్ ని గుర్తిస్తారు. అందుకే.. బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. మంచి మెజారిటీతో కూడా గెలుపొందాడు. ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఇంకా మొదటి జీతం అందుకోలేదు. అందుకే ఇంకా గుడిసెలోనే ఉంటున్నాడు. ఇది చూడలేని నియోజక వర్గాల ప్రజలు ఆయన కోసం ఇల్లు కట్టిస్తున్నారు. జీతం రాగానే ఆ సొమ్ముని ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తానని చెప్తున్నాడు సీతారామ్. నిజంగా సీతారామ్ ఆదివాసి లాంటి ఎమ్మెల్యేలు ఈ రోజుల్లో కూడా ఉండడం గర్వించాల్సిన విషయం . మొత్తానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకు భిన్నంగా ఉన్న ఈ ఎమ్మెల్యేని , నిరుపేద అయినా గెలిపించి ఆయనకు ఇల్లు కట్టిస్తున్న ఈ నియోజకవర్గ ప్రజలను అభినందించాల్సిందే .

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article