Hurdles for Jagan
రాజకీయాల్లో ఏదీ శాశ్వతంగా ఉండదు. కానీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఒకటి మాత్రం అతనికి శాశ్వతంగా కనిపిస్తోంది. ఏ అంశమైనా కోర్టుల్లో అతనికి వ్యతిరేకంగా తీర్పులు వస్తుండటం. ఈ విషయంలో హై కోర్ట్ పై అసహనం వ్యక్తం చేయడం.. తమ పార్టీ నేతలతో హై కోర్ట్ ను కూడా పార్టీ గొడవల్లోకి లాగడం చేస్తున్నారు తప్ప.. తాము చేసిన తప్పులు లేదా.. కోర్టుల్లో ఉన్న అంశాలపట్ల సరైన విశ్లేషణ మాత్రం కనిపించడం లేదు అనేది నిజం. ఆ కారణంగానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చెందిన వారిలో నలభై మందికి పైగా కోర్టు నోటీసులు పంపించింది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపితో పాటు జర్నలిస్ట్ కొమ్మినేని వెంకటేశ్వరరావు కూడా ఉండటం గమనార్హం. ఒక రకంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాళ్లు కూడా కోర్ట్ ల తీర్పులను అంచనా వేస్తూ.. ఆ తర్వాతి పరిణామాల గురించి మాట్లాడాల్సిన వాళ్లు కూడా చౌకబారు కమెంట్స్ తో కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఇప్పటికే హై కోర్ట్ లో జగన్ కు వ్యతిరేకంగా యాభైకి పైగా కేస్ ల్లో తీర్పులు వచ్చాయి. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన న్యాయస్థానానికి అతీతుడు కాదనే విషయం కుండబద్ధలు కొట్టింది హైకోర్ట్.
తాజాగా తనకు చెప్పకుండా స్థానిక ఎన్నికలను కరోనా వైరస్ ను చూపించి వాయిదా వేశారనే కారణంతో గతంలో తొలగించిన ఎన్నికల కమీషన్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కేస్ లో కూడా జగన్ ఓడిపోయారు. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు అతనికి ప్రజల్లో ఎంత బలం ఉందనే విషయం పక్కన బెడితే ప్రతిపక్షాల్లో ఎన్ని తక్కువ సీట్లు ఉన్నా ఇంత బలం ఎలా ఉందీ అనే విషయాన్ని విశ్లేషించుకోవాలి. కోర్ట్ ల వ్వవహారాలు వేరే ఉంటాయి. లా పాయింట్స్ విషయంలో చిన్న క్లూ చాలు.. తీర్పులు మారిపోవడానికి. అయితే జగన్ ఇలాంటి విషయాలపై అస్సలు దృష్టిపెట్టడం లేదు. ఎంత సేపూ 23 సీట్ల ప్రతిపక్షం అంటూ తీసి పారేయడంతో పాటు అస్సలు లెక్క చేయడం లేదు. కానీ కోర్ట్ కు ఈ సీట్స్ లో పనిలేదు కదా. అందుకే ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షాల ప్లానింగ్ తో కూడిని కేస్ లు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని కేస్ లు ఓడిపోయిన తర్వాత కనీసం తన టీమ్ ను మార్చుకుంటారు. న్యాయ సలహాదారులను సంప్రదిస్తారు. తన వైపు నిజం ఉందా లేదా అనేది పక్కన బెడితే రాజకీయంగా కార్నర్ కాకుండా మేధావుల సలహాలూ తీసుకుంటారు.
ఈ విషయంలో జగన్ మొదటి నుంచి ఒంటెద్దు పోకడగానే ఉన్నారు. ఇక ఇలాంటి వ్యవహారాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుది అందెవేసిన మైండ్ అని అందరికీ తెలుసు. అందుకే ప్లానింగ్ తో కూడిన కేస్ లు పెడుతూ.. విజయాలు సాధిస్తూ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ రోజు రోజుకూ ప్రభుత్వం పై ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వచ్చేలా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. దానికి అతనికి ఏ చిన్న విషయాన్నైనా భూతద్దంలో చూపించే మీడియా కూడా తోడుంది. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పటికైనా తన న్యాయసలహాల టీమ్ ను మార్చుకుంటే మంచిది.