హుజూర్ నగర్ ఎవరి పరం?

HUZURNAGAR BYPOLL

హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడింది. దీంతో పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపుపై ఏ పార్టీకి ఆ పార్టీ లెక్కలు వేసుకుంటున్నాయి. వాస్తవానికి ప్రధాన పోటీ అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ఉంది. బీజేపీ కేవలం తన ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలన్న లక్ష్యంతోనే ముందుకెళుతోంది. అటు టీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు పోటీ ఇచ్చే పరిస్థితిలో కమలనాథులు లేరనే సంగతి వారికి కూడా తెలుసు. అందుకే ఓట్ల పెంపుపైనే కాషాయదళం దృష్టి సారించింది. పార్లమెంటు ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు పొందిన టీఆర్ఎస్.. ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తోంది. షెడ్యూల్ వెలువడటానికి ముందుగానే క్షేత్రస్థాయి పరిస్థితులపై అంచనాకు వచ్చిన గులాబీ దళం.. అందుకు అనుగుణంగా చకచకా వ్యూహాలు రచించింది. పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్.. ఎలాగైనా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ పై గులాబీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు.

మరోవైపు కాంగ్రెస్ సైతం అధికార పార్టీకి ధీటుగానే పోరాడుతోంది. తమ స్థానాన్ని నిలుపుకోవాలన్న కసితో ముందుకెళుతోంది. దీంతో అక్కడ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశంపై టీఆర్ఎస్ అధినేత సర్వే చేయించినట్టు సమాచారం. ఇప్పటివరకు మూడు సర్వేలు చేయించగా.. తాజాగా జరిపిన సమ్మెలో మైండ్ బ్లాక్ అయ్యే ఫలితం వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె మొదలుకాక ముందు జరిపిన సర్వేల్లో అనుకూలంగా వచ్చిన ఫలితం.. సమ్మె మొదలైన తర్వాత చేసిన సర్వేలో మాత్రం తేడా కొట్టినట్టు సమాచారం. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు సంఘాల నేతలు, కుల పెద్దలను తమకు అనువుగా మలుచుకున్న టీఆర్ఎస్.. తాజా సర్వే ఫలితంతో మరింత జాగ్రత్తగా ముందుకెళ్తున్నట్టు అర్థమవుతోంది. కాగా, గురువారం హుజూర్ నగర్ లో నిర్వహించతలపెట్టిన సీఎం కేసీఆర్ సభ రద్దయింది. వర్షం కారణంగా ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ ప్రకటించింది.

TS POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *