వరద నీటి సమస్య పరిష్కారమెలా?

Hyderabad Water Storm Solutions

గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని వరద నీటి ముంపు సమస్య నుంచి విముక్తి కలిగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇంజనీర్లు, ఆయా రంగాల నిపుణులు సుదీర్ఘ సమాలోచనలు జరిపి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. శనివారం మంత్రుల అధికార నివాసంలో వినోద్ కుమార్ తో జరిగిన ఈ భేటీలో ఇంజనీర్లు, నిపుణులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

హైదరాబాద్ లో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసిన పక్షంలో ఆ సమస్యను అధిగమించడం ఎలా? ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటీ? అనే అంశాలపై చర్చించారు. సూక్ష్మ పరిశీలన, లోతైన విశ్లేషణలతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను వరద నీటి బారి నుంచి కాపాడుకోవడమే ఏకైక అజెండాతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లోని 185 చెరువులను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో లింక్ చేయడం ద్వారా వరద నీటి ఫ్లో ను మళ్లించి ముంపు సమస్యను అధిగమించ వచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. నాలాలను పునరుద్ధరించడం, ఆక్రమణలు తొలగించడం ద్వారా వరద నీటి ప్రవాహాన్ని క్రమబద్దీకరించ వచ్చని నిపుణులు పేర్కొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఈ పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా శాశ్వత పరిష్కార మార్గాన్ని కనుగొని నిర్ణీత గడువులోగా ఈ కమిటీ నివేదిక ఇచ్చేలా చూడాలని సమావేశం అభిప్రాయపడింది. వంద సంవత్సరాల క్రితం నాలుగైదు లక్షల మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు దాదాపు 17 వేల మంది చనిపోయారని, ప్రస్తుతం సుమారు కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో వందేళ్ళ తర్వాత భారీ వర్షం కురిసిందని, అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తగ్గిందని నిపుణులు వివరించారు.

ఇటీవల హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన కాలనీల్లో 45 శాతం కాలనీలు మొదటి సారిగా ముంపుకు గురయ్యాయని, మరో 35 శాతం కాలనీలు రెండో, మూడోసారి, మిగతా 10 శాతం కాలనీలు పలుమార్లు ముంపుకు గురయ్యాయని సర్వేలో వెల్లడైందని ఇంజనీర్లు తెలిపారు. గండిపేట ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వరద నీటిని మూసీ నది పరీవాహక ప్రాంతంతో అనుసంధానం చేసి, ఆక్రమణలు తొలగించి, వరద నీటిని సులువుగా తరలించవచ్చని ఇంజనీర్లు పేర్కొన్నారు.

మూసి నదిలోని మురికి నీటిని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నిరంతరం శుద్ధి చేసి, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వరద నీటిని కింది భాగానికి తరలిస్తే బాగుంటుందని నిపుణులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎదుర్కొంటున్న పరిస్థితులను చక్కదిద్దడం పెద్ద సమస్య కాదని ఇంజనీర్లు, నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ వరద నీటి సమస్య పరిష్కారానికి త్వరలోనే సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లకు సమగ్ర నివేదికను అందజేయనున్నట్లు వారు తెలిపారు.

ఈ భేటీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జీ. రామేశ్వర్ రావు, కార్యదర్శి అంజయ్య, ఇరిగేషన్ ప్రాజెక్టుల ఈ.ఎన్.సీ అనిల్ కుమార్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సత్తి రెడ్డి,
వరంగల్ నిట్ మాజీ డైరెక్టర్ ప్రొ. పీ.జీ. శాస్త్రి, జీహెచ్ఎంసీ లేక్స్ ఎస్.ఈ. శేఖర్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ హెడ్ ప్రొ. గోపాల్ నాయక్, జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సులర్ ప్రొ. సాయిబాబా రెడ్డి, డైరెక్టర్ ప్రొ. లక్ష్మణ్ రావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు అనురాధ రెడ్డి, సురేష్ కుమార్, శ్రీనివాస్ కుమార్, ఐఐఐటీ ప్రొ. ప్రదీప్ కుమార్, జేఎన్టీయూ ప్రొ. బాణోత్ రమణ నాయక్, నీరి డైరెక్టర్ డా. షేక్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

Hyderabad Rain Water Issues

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article