I WILL NEVER ASKED THAT TYPE OF QUESTIONS
- అమ్మాయిలను తక్కువ చేసే అంశాల జోలికెళ్లను
- కాఫీ విత్ కరణ్ కార్యక్రమంపై కరణ్ జోహార్ వెల్లడి
- పాండ్యా, రాహుల్ పై నిషేధం ఎత్తివేతతో హర్షం
‘కాఫీ విత్ కరణ్’.. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన టీవీ షో ఇది. ఈ షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దర్శక నిర్మాత కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలు చాలా బోల్డ్ గా ఉంటాయి. ముఖ్యంగా శృంగారం గురించి ఇందులో కరణ్ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఈ షోకి వచ్చిన సెలబ్రిటీలు కూడా వాటికి నిక్కచ్చిగా సమాధానాలు చెబుతుంటారు. ఇప్పటివరకు దీనిపై పెద్దగా వివాదాలు రాకపోయినా.. అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడిన భారత క్రికెటర్లు హార్థిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ మాత్రం బుక్కయిపోయారు. ఏకంగా జట్టు నుంచే ఉద్వాసనకు గురయ్యారు. తాజాగా వారిద్దరిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతో కరణ్ ఆనందం వ్యక్తంచేశాడు. తన వల్లే వారిద్దరూ జట్టు నుంచి నిషేధానికి గురయ్యారని, ఆ సమయంలో తాను చాలా బాధపడ్డానని చెప్పాడు. ‘నా పిచ్చి ప్రశ్నల వల్లే మీరు ఈ వివాదంలో చిక్కుకున్నారు. నన్ను క్షమించండి అని పాండ్యా, రాహుల్‌లను కోరాను. పెద్ద మనసుతో వారిద్దరూ నన్ను క్షమించారు. అది మీ తప్పిదం కాదని చెప్పారు. నా తల్లి పాండ్యా అభిమాని. ఈ వివాదంతో ఆమె తీవ్రంగా మనస్తాపం చెందారు’ అని కరణ్ తెలిపాడు. ఈ కార్యక్రమంలో అమ్మాయిల గురించి ప్రశ్నలు అడగడం కొత్త కాదని వెల్లడించాడు. ఇకపై అమ్మాయిలను తక్కువ చేసే ప్రశ్నలు అడగనని స్పష్టంచేశాడు.