నల్గొండ నుండి ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ పోటీ చేస్తే కోమటి రెడ్డి కి షాక్ తగిలినట్టే

If KCR will be Nalgonda MP big shock for Komita reddy

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ నుండి పోటీ చెయ్యనున్నారు ?నల్గొండ నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా ? ఒకవేళ ఆయన పోటీ చేస్తే ఆయనకు పోటీగా నిలబడే సత్తా ఎవరికి వుంది? నల్గొండ నుండి కోమటి రెడ్డి వెంకట రెడ్డి పోటీ చేస్తానని చెప్పిన నేపధ్యంలో ఆయన కేసీఆర్ అంటే పోటీ చేస్తారా? వంటి అంశాలు ఇప్పుడు తెలంగాణా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి.
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు నల్లగొండ లోకసభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తారని ఆయన తనయుడు కేటీ రామారావు ఇప్పటికే ప్రకటించారు. అదే సమయంలో మెదక్ లోకసభ స్థానం నుంచి ప్రభాకర్ రెడ్డిని తిరిగి గెలిపించాలని కేసీఆర్ స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు. దీంతో ఆయన నల్లగొండ స్థానం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. నల్లగొండ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెసు తరఫున లోకసభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. నల్లగొండ నుంచి కేసీఆర్ పోటీ చేస్తే కోమటి రెడ్డి వెంకటరెడ్డి మరోసారి తిరుగులేని దెబ్బ తగిలే అవకాశం ఉంది.
గతంలో కేసీఆర్ మూడు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ లోకసభ స్థానాలకు ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించారు. తొలిసారి 2004లో కరీంనగర్ నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006, 2008ల్లో కూడా ఆయన కరీంనగర్ నుంచి విజయం సాధించారు. 2014లో గజ్వెల్ శాసనసభ స్థానం నుంచే కాకుండా మెదక్ లోకసభ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేశారు. ఆ తర్వాత లోకసభ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి మెదక్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో ఒక్క స్థానాన్ని మజ్లీస్ కు వదిలేసి మిగతా 16 స్థానాలను గెలుచుకోవడానికి అవసరమైన ప్రణాళికను కేసీఆర్ రూపొందిస్తున్నారు. 2014 ఎన్నికల్లో నల్లగొండ నుంచి కాంగ్రెసు నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి లోకసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. గుత్తా సుఖేందర్ రెడ్డిని రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. తద్వారా నల్లగొండ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయడానికి వీలు కలుగుతుందని అంటున్నారు. అయితే, నల్లగొండ నుంచి పోటీ చేసే విషయంలో కేసీఆర్ ఇప్పటి వరకు కచ్చితమైన నిర్ణయమేదీ తీసుకోలేదని పార్టీ వర్గాలంటున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article