గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ శుక్రవారం న్యూఢిల్లీలో ఇండియా టుడే
కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. RRR స్టార్ రామ్‌చరణ్ ఇండియన్ సినిమాకు
ప్రతినిధిగా పాల్గొన్నారు. తన కెరీర్ గురించి, నాటు నాటు పాటకు
ఆస్కార్ రావడం గురించి మాట్లాడారు. నెపోటిజం గురించి తన అభిప్రాయాన్ని
వెలిబుచ్చారు. మరెన్నో విషయాలను ఆయన పంచుకున్నారు. తన స్టాఫ్
మెంబర్స్ గురించి అక్కడ ప్రస్తావించడమే కాకుండా, వారిని అందరికీ
పరిచయం చేశారు. తన భార్య ఉపాసన కొణిదెలను స్టేజ్ మీదకు
ఆహ్వానించాడు. ఆ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా
రామ్‌చరణ్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలివీ…
– ఆస్కార్ పొందడం అపురూపమైన విషయం. మన సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్
కేటగిరీలో ఆస్కార్ గెలిచిందన్న విషయాన్ని నేనింకా
నమ్మలేకపోతున్నాను. నన్ను నేను గిల్లిచూసుకుంటున్నాను. నా భార్య నా
లక్కీ మస్కాట్. ఆమె కడుపులో ఉన్న ఐదు నెలల శిశువు నాకు ఇంకా లక్కీ.
త్వరలోనే తండ్రిని కాబోతున్నాను. అన్నీ మంచి విషయాలు ఒకసారే
జరుగుతున్నాయి.
– ఆస్కార్ ఈవెంట్ జరిగిన ప్రదేశంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.
నా చిన్నతనం నుంచి నేను ఆస్కార్‌కి పెద్ద ఫ్యాన్‌ని. మనం ఆస్కార్‌కి
రీచ్ అయ్యాం. గెలుస్తామా? లేదా? అనేది నా దృష్టిలో పెద్ద విషయం కానే
కాదు. ఆ వేదిక దాకా వెళ్లడమే నా దృష్టిలో పెద్ద గౌరవం. అది అరుదైన
గుర్తింపు. మన సినిమాకు అక్కడ ప్రతినిధులుగా నిలుచోవడం ఆనందంగా
అనిపించింది.
– ఆస్కార్ వేడుక జరగడానికి ముందు మాలో ఎలాంటి భావోద్వేగాలు లేవు.
కంగారుతో స్తబ్దుగా అనిపించింది. నా భార్య నా చేతిని గట్టిగా
పట్టుకోవడం గుర్తుంది. మైక్ టైసన్ గట్టిగా పట్టుకున్నట్టు
అనిపించింది.
– ఆస్కార్‌లో నాటు నాటు పాటకు నృత్యం చేయడానికి నేను 100 శాతం
సిద్ధంగానే ఉన్నాను. కానీ అక్కడేం జరిగిందో నాకు నిజంగా తెలియదు.
అక్కడ పెర్ఫార్మ్ చేసినవారు మాకన్నా చాలా బాగా చేశారు. భారతదేశానికి
చెందిన పాటకు ఇంకెవరో స్టేజ్ మీద నృత్యం చేస్తుంటే చూసి ఆనందించడం
మావంతైంది. నాటు నాటు మన భారతీయ గీతం.
– నాటు నాటుకు పనిచేసిన ప్రతి ఒక్కరినీ ప్రశంసించాలి. ఉక్రెయిన్‌కి
చెందిన 200 మంది క్రూ మెంబర్స్ ని కూడా ప్రశంసించారు. నేను, నా భార్య
వెకేషన్‌కి ఉక్రెయిన్‌కి వెళ్లాలనుకున్నాం. కానీ పాట చిత్రీకరించిన
మూడు నెలల్లోపే అక్కడ యుద్ధం జరిగింది.
– నేనూ, తారక్ RRR ప్రారంభం కావడానికి కొన్నేళ్ల క్రితమే
స్నేహితులమయ్యాం. రాజమౌళి కాకపోయి ఉంటే, మరే దర్శకుడికోసమూ
మేమిద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేసేవాళ్లం కాదేమో.
– రాజమౌళితో నేను చేసిన తొలి సినిమా మగధీర బ్లాక్ బస్టర్ అయింది.
టాస్క్ మాస్టర్లతో పనిచేయడం నాకు చాలా ఇష్టం. నా కాళ్ల మీద నేను
నిలుచోవడం ఇష్టం. రాజమౌళిగారితో పనిచేయడం అంటే పాఠశాలకు
వెళ్లినట్టే భావిస్తాను. మా నాన్న చిరంజీవి, మా బాబాయ్ పవన్ కల్యాణ్
తర్వాత నేను అంతగా గౌరవించే వ్యక్తి రాజమౌళి.
– ఈ తరంలో రీజినల్ సినిమా అనేదే ఉండదు. ఇప్పటిదాకా మనకు వెస్ట్
బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ఎన్నో రీజినల్ సినిమా ఇండస్ట్రీలు
ఉండేవి. కానీ ఇప్పుడు సరిహద్దులు చెరిగిపోయాయి. మూలాల్లోకి వెళ్లి
కథలను పట్టుకోగలగాలి. మగధీర అలాంటి సినిమానే. లగాన్ అలాంటి
సినిమానే. కొరియా పారసైట్ ఆ తరహా సినిమానే. మట్టి కథను, పోరాటాల
కథలను చెప్పగలిగినప్పుడు ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు
వస్తాయి. గ్లోబల్ ఆడియన్స్ మన సినిమాలను ఇండియన్ సినిమాలను ఒక్క
సినిమాగా చూడగలగాలి.
– నెపోటిజం మీద జరుగుతున్న చర్చ నాకెప్పుడూ అర్థం కాదు. అందరూ అంటారు
కాబట్టి మిగిలినవారు కూడా అంటుంటారేమో. అసలు అందులోని లైన్ల గురించి
ఎంత మంది అర్థం చేసుకుంటారో కూడా ఊహించలేం. ప్రఖ్యాత జర్నలిస్టు
పిల్లలు జర్నలిస్టు కావాలనుకుంటారు. తల్లిదండ్రుల బాటలో పిల్లలు
నడవాలనుకోవడం మనకు ఎప్పటి నుంచో వస్తున్నదే. నాకు సినిమా అంటే
పంచప్రాణాలు. నేను పుట్టినప్పటినుంచే ఫిల్మ్ స్కూల్లో ఉన్నా. నాకు ఆ
కళ తెలుసు. నేను పనిని సక్రమంగా చేయకపోతే ఈ ఇండస్ట్రీలో
ఉండలేను. తల్లిదండ్రులు ఈ రంగంలో పేరు ప్రఖ్యాతులతో ఉంటే, ఒక్కడుగు
ధైర్యంగా వేయగలుగుతారేమో! కానీ, తదనంతరం మన టాలెంటే మాట్లాడుతుంది.
కేజీయఫ్ స్టార్ యష్ తండ్రి స్టార్ కాదు. కానీ ప్రతిభను ఎవరూ
ఆపలేరు. ఎవరి విషయంలోనైనా అదే చెల్లుతుంది.
– హాలీవుడ్‌లో పనిచేయాలని అనుకుంటున్నాను. నా కల నెరవేరుతుందని
భావిస్తున్నాను. హాలీవుడ్ ప్రాజెక్టుకు సంతకం చేశానా? లేదా? అనేది
ఇప్పుడు మాట్లాడటం సబబు కాదు. ఏదైనా మెటీరియలైజ్ అయ్యేవరకు
ప్రాసెస్‌లో ఉన్నట్టే. కానీ, తప్పక జరిగి తీరుతుంది (నవ్వుతూ).
– నేను వ్యక్తిగానూ, నటుడిగానూ ఎదుగుతూనే ఉన్నాను. దర్శకుడిని
మెప్పించడం ఏ నటుడికైనా కీలకమే. దర్శకుడి మనసులో ఉన్న విషయాన్ని
గ్రహించగలగాలి.
– నేనెప్పుడూ హిందీ సినిమాలను చూస్తూ ఉండేవాడిని. అత్యధిక మంది
ప్రేక్షకులకు రీచ్ కావడమే నా లక్ష్యం. బాలీవుడ్ ఎన్నో ఏళ్లుగా
ఎన్నెన్నో ఘన విజయాలను సొంతం చేసుకుంది. సౌత్ ఇండియన్ సినిమా వచ్చి
ఏదో చేసిందని కాదు. మనం కలిసి చరిత్ర సృష్టించాలి.
– నాకు తెలిసి ప్రతి హీరో యాక్షన్ హీరో కావాలని కోరుకుంటాడు.
రొమాంటిక్ యాక్టర్స్ కూడా యాక్షన్ సినిమాలు చేయడానికి అరుదుగా ఆసక్తి
చూపిస్తుంటారు. నేను నాన్ యాక్షన్ సినిమాలు చేస్తే ప్రేక్షకులు
ఆహ్వానిస్తారనే భావిస్తున్నాను.
– నేను నటుడినైన తొలిరోజే మా నాన్న నన్ను పిలిచి, నా స్టాఫ్ మెంబర్స్
ని బాగా చూసుకోమని చెప్పారు. వాళ్లు అసంతృప్తితో ఉంటే, మన పని
అయిపోయినట్టే.
– నా భార్య షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్. నేను సల్మాన్ ఖాన్ ఫ్యాన్. నేను
ఇప్పటిదాకా సినిమాల్లో ఎవరినీ అనుకరించలేదు. విలక్షణం అనేది
నటుడికి చాలా కీలకం. ఎవరి శైలి వాళ్లకు ఉన్నప్పుడే రాణిస్తారు.
– నేనిప్పుడు శంకర్‌తో సినిమా చేస్తున్నాను. ఈ చిత్రంలో పాత్ బ్రేకింగ్
క్యారెక్టర్ చేస్తున్నాను. రంగస్థలం సినిమాను మించిన మరో సినిమాలో
బెస్ట్ పాత్ర చేస్తాను. ఆ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ నుంచి
ఉంటుంది. పాశ్చాత్యదేశాల్లోనూ ఆ సినిమాను అంగీకరిస్తారనే నమ్మకం
ఉంది.
– ఏక సమయంలో ఒక సినిమాకన్నా ఎక్కువే చేయాలనుకుంటున్నాను. నా ఈఎంఐలు
కట్టుకోవాలంటే కష్టపడాలి. కానీ నేను పనిచేస్తున్నవారందరూ
గొప్పగొప్పవారు. వారు నా పూర్తి ఏకాగ్రత ఒక్క సినిమా మీదే ఉండాలని
కోరుకుంటున్నారు. ఏడాదికి రెండు సినిమాలు చేయాలన్నది నా చిరకాల కల.
మా నాన్న 67 ఏళ్ల వయసులో మూడు సినిమాలు చేస్తున్నారు. ప్రతిరోజూ
తెల్లారుజామున లేచి జిమ్‌కి వెళ్తారు. మా నాన్నలాగా నేను కూడా
యాక్టివ్‌గా ఉండాలని జనాలు కోరుకుంటున్నారు.
– పెద్ద నటన రాకపోయినా క్రమశిక్షణతో సుదీర్ఘ ప్రయాణం చేయొచ్చు.
ఎంత గొప్ప నటుడైనా క్రమశిక్షణ లేకుంటే కష్టాలపాలవుతాడు. నేను ఓ
నావ మీదే ప్రయాణిస్తాను. ఆ నావ సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. నాకు
రాజకీయాలతో ప్రమేయం లేదు. రాజకీయనాయకుడిని కాదలచుకోవడం లేదు.
– నాకు స్పోర్ట్స్ సినిమా చేయాలని ఉంది. ఎప్పటి నుంచో అది కలగానే
ఉంది. మరి విరాట్ కోహ్లీగా నటిస్తారా? అని వ్యాఖ్యాత అడగగా, ఆయన
నాకు ఇన్సిరేషన్. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా. చాలా
బావుంటుంది అంటూ చరణ్ సమాధానమిచ్చారు.