In the case of irregular cases of jagan
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులు మళ్ళీ మొదటికి వచ్చాయి. వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు శుక్రవారం ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటికే, గత ఏడాది జగన్ పైన విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి కేసును హైకోర్టు ఎన్ఐఏకు అప్పగించింది. జగన్ అక్రమాస్తుల కేసులోను కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
జగన్ అక్రమాస్తుల కేసు ఏళ్లుగా విచారణ సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ కేసుల్లో 11 చార్జీషీట్లు దాఖలు చేశారు. నాలుగు ఛార్జీషీట్లపై రెండున్నరేళ్లుగా విచారణ సాగుతోంది. ఇప్పుడు అది మళ్లీ మొదటికి వచ్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జగన్, విజయసాయి రెడ్డి, ఇతర నిందితులందరి పైనా మళ్లీ మొదటి నుంచి విచారణ జరగనుంది.
ఈ కేసు విచారణ మళ్లీ మొదటికి రావడానికి కారణం ఉంది. ఇటీవల ఉమ్మడి హైకోర్టు విడిపోయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జి వెంకటరమణ బదిలీ పైన ఏపీకి వెళ్లారు. ఆయన స్థానంలో కొత్తగా జడ్జిని నియమించలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరు జడ్జిగా వచ్చినా తిరిగి వాదనలను మొదటి నుంచి వినాల్సిందే. విచారణలో భాగంగా శుక్రవారం (జనవరి 4) జగన్ తదితరులు కోర్టుకు హాజరయ్యారు. విచారణను కోర్టు మూడు వారాల పాటు వాయిదా వేసింది. తిరిగి 25వ తేదీన విచారణకు ప్రారంభం కానున్నట్లు తాత్కాలిక జడ్జి తెలిపారు.
సీబీఐ జగన్ ఆస్తుల కేసులో ఛార్జీషీట్లను దాఖలు చేసింది. విచారణ ప్రక్రియలో భాగంగా జగన్, విజయసాయి రెడ్డి సహా ఇతర నిందితులు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. నేరానికి ఎలాంటిసంబంధం లేకుండానే తమపై అక్రమంగా కేసులు బనాయించారని, కావున ఎఫ్ఐఅర్, ఛార్జీషీట్ల నుంచి తమను తప్పించాలని పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై వాదనలు కొనసాగుతున్నాయి. రెండున్నరేళ్లుగా నాలుగు ఛార్జీషీట్లపై వాదనలు పూర్తయ్యాయి. ఇప్పుడు జడ్జి ఏపీకి బదలీ కావడంతో వచ్చే న్యాయవాది డిశ్చార్జ్ పిటిషన్ పైన మళ్లీ వాదనలు వినాల్సి ఉంటుంది.
ఒక్కో ఛార్జిషీట్‌లో తీర్పు వెల్లడించినట్లయితే ఇతర కేసులపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. అందుకే అన్ని కేసుల్లో ఒకేసారి తీర్పు ఇవ్వాలని గతంలో సీబీఐ న్యాయస్థానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిశ్చార్జ్ పిటిషన్లపై మళ్లీ వాదనలు జరగనున్నాయి. మరోవైపు, హైకోర్టు విభజన, జగన్ అక్రమాస్తుల కేసు అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు గతంలోనే జోస్యం చెప్పారు. ఆయన అంచనా నిజమే అయింది. ఉమ్మడి హైకోర్టు విడిపోతే జగన్ కేసుల విచారణ మళ్లీ మొదటికి వస్తుందని చెప్పారు. కేసుల విచారణను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకే జగన్‌తో కలిసి బీజేపీ కుట్ర చేస్తోందని ఇటీవల ఆరోపించారు. హైకోర్టు భవనం పూర్తికాకుండానే విభజన చేశారని, హడావుడిగా కోర్టులను తరలించారని మండిపడ్డారు. ఈ నిర్ణయం వల్ల జగన్ కేసులు వీగిపోయేలా చేస్తారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.