INDIA LOST SERIES
- కివీస్ తో మూడో టీ20లో భారత్ పరాజయం
- పోరాడి ఓడిన టీమిండియా
విదేశీ గడ్డపై వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. కివీస్ లో తొలిసారిగా టీ20 సిరీస్ చేజిక్కించుకోవాలన్న భారత ఆశలు నెరవేరలేదు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఆదివారం జరిగిన చివరి టీ20లో భారత జట్టు ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కివీస్ కైవసం చేసుకుంది. 213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శిఖర్ ధావన్(5) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరినప్పటికీ, విజయ్ శంకర్(43;28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషభ్ పంత్(28; 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా(21;11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించారు. రోహిత్ శర్మ(38;32 బంతుల్లో 3 ఫోర్లు) కూడా రాణించడంతో భారత జట్టు విజయం దిశగానే వెళ్లింది. అయితే, 141 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్ కావడం, వెంటనే హార్దిక్, ధోని(2) కూడా నిష్ర్రమించడంతో టీమిండియా కష్టాల్లో పడింది.
చివర్లో దినేశ్ కార్తీక్(33 నాటౌట్; 16 బంతుల్లో 4 సిక్సర్లు), కృనాల్ పాండ్యా(26 నాటౌట్; 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. కివీస్ ఓపెనర్లు టీమ్ సీఫెర్ట్ (43;25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అతనికి జతగా మరో ఓపెనర్ కొలిన్ మున్రో(72; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. గ్రాండ్‌హోమ్(30;16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డార్లీ మిచెల్(19 నాటౌట్; 11 బంతుల్లో 3 ఫోర్లు), రాస్ టేలర్(14 నాటౌట్; 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) సమయోచితంగా రాణించడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్‌లకు తలో వికెట్ లభించింది.