INDIA WON LAST ODI
- 4-1 ఆధిక్యంతో సిరీస్ కైవసం
కివీస్ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో ఆతిథ్య జట్టుపై 35 పరుగుల తేడాతో విజయం సాధించి, 4-1 తేడాతో సిరీస్ దక్కించుకుంది. 1967 నుంచి కివీస్ పర్యటనకు వెళుతున్న టీమిండియా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే 2008-09లో 3-1 తేడాతో సిరీస్ విజయాన్ని అందుకుంది. తాజాగా 4-1తో అతిపెద్ద సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుని నయా చరిత్రను సృష్టించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ(2), శిఖర్ ధావన్ (6), శుభ్‌మన్ గిల్(7), ఎంఎస్ ధోని(1)లు స్వల్పస్కోర్లకే పెవిలియన్ క్యూ కట్టారు. ఈ దశలో హైదరాబాదీ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు 90 (113 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్ లు), ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ 45 (64 బంతుల్లో 4 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. చివర్లో కేదార్ జాదవ్ 34, పాండ్యా 45 మెరుపులు మెరిపించడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.
అనంతరం 253 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన కివీస్ 217 పరుగులకే కుప్పకూలింది. పదునైన బంతులతో షమీ విరుచుకుపడ్డాడు. ఓపెనర్లు హెన్రీ నికోల్స్(8), కొలిన్ మున్రోలను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే రాస్ టేలర్‌ను పాండ్యా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఈ క్రమంలో లాథమ్, విలియమ్సన్‌లు క్రీజ్ లో కుదురుకుంటున్న సమయంలో కెప్టెన్ విలియమ్సన్(39)ను జాదవ్ ఔట్ చేశాడు. తర్వాత లాథమ్(37), గ్రాండ్‌హోమ్(11)లను చహల్ పెవిలియన్ పంపించాడు. నీషమ్(44) రనౌట్‌గా వెనుదిరిడం.. సాట్నర్(22), అశ్లే(10), బోల్ట్(1)ల వికెట్లు కూడా త్వరగా కోల్పోవడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో చహల్‌కు మూడు, పాండ్యా, షమీలకు రెండు వికెట్లు పడగా.. భువన్వేశర్, జాదవ్‌లకు తలో వికెట్ దక్కింది.