India Won Second Match
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాను రెండో వన్టే మ్యాచులో మట్టి కరిపించింది. తీవ్ర ఒత్తిడి మధ్య జరిగిన ఈ మ్యాచులో ఎట్టకేలకు భారత్ విజయకేతనం ఎగురవేసింది. కెప్లెన్ కోహ్లీ వీరోచిత సెంచరికి.. ధోని మెరుపులు తోడవ్వడంతో భారత్ జట్టు మరో నాలుగు బంతులుండగానే మ్యాచ్‌ను గెలిచింది. తొలుత టాస్ గెలిచిన ఆసీస్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో 298 పరుగుల్ని చేసింది. ఆసీస్ జట్టులో షాన్ సెంచరీతో మెరిశాడు. ఒకానొక దశలో నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. స్కోరును దాదాపు మూడు వందలకు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి మ్యాక్స్‌వెల్ మంచి తోడ్పాటును అందించాడు. ఈ ఇద్దరే దాదాపు 179 పరుగుల్ని రాబట్టగలిగారు. 299 పరుగుల చేధనను ఆరంభించిన భారత్ జట్టులో రోహిత్, ధవన్ మంచి ఆరంభాన్నిచ్చారు. ధవన్ 32, రోహిత్ శర్మ 43 పరుగులు చేయగా.. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండు సిక్సులు, ఐదు ఫోర్లతో సెంచరీ చేశాడు. చివర్లో మాత్రం మాజీ కెప్టెన్ ధోని చెలరేగి ఆడాడు. చాలా రోజుల తర్వాత తన మార్కు ఇన్సింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో సిక్స్ కొట్టి భారత్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.