INDIAN-2 SHOOTING STOP
- బడ్జెట్ పై నిర్మాణ సంస్థ లైకాతో దర్శకుడు శంకర్ కు అభిప్రాయ బేధాలు
- నిలిచిపోయిన చిత్ర నిర్మాణం
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమా ఆగిపోయిందా? రోబో-2 నష్టాల నేపథ్యంలో భారతీయుడు-2 సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాణ సంస్థ లైకాకు, దర్శకుడు శంకర్ కు మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం భారతీయుడు-2 సినిమా షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రజనీ, శంకర్ కాంబోలో వచ్చిన రోబో-2 సినిమా ఆశించిన అంచనాలను అందుకోలేకపోయింది. మొత్తమ్మీద ఈ సినిమా వల్ల లైకా సంస్థకు దాదాపు రూ.100 కోట్ల నష్టం వచ్చినట్టు సమాచారం. శంకర్ ఆ ఖర్చు, ఈ ఖర్చు అని నిర్మాతల చేత విపరీతంగా సొమ్ము ఖర్చు చేయించారని, దీంతో భారీ నష్టాలు మూట కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. దీంతో ఈ ప్రభావం భారతీయుడు-2 సినిమాపై పడింది. ఈ సినిమాను కూడా లైకా సంస్థే నిర్మిస్తోంది.
ఈ సినిమా కోసం రూ.200 కోట్ల నుంచి రూ.220 కోట్ల బడ్జెట్ అవుతందని శంకర్ ప్రతిపాదనలు ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే, సినిమా మొదలయ్యాక ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావించిన లైకా సంస్థ.. రూ.250 కోట్ల లోపుగానే సినిమా పూర్తి చేయాలని శంకర్ ను కోరినట్టు తెలిసింది. ఇందుకు అగ్రిమెంట్ చేయాలని అడిగింది. ఇందుకు శంకర్ ససేమిరా అన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై రూ.30 కోట్ల వరకు లైకా ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు శంకర్ కూడా ప్రత్యామ్నాయాలు వెతికే పనిలో పడినట్టు చెబుతున్నారు. భారతీయుడు-2 నుంచి లైకా తప్పుకుంటే, ఈ ప్రాజెక్టును టేకోవర్ చేసేందుకు ఎవరైనా ముందుకు వచ్చే అవకాశం ఉందా అని ఆయన అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇంత భారీ బడ్జెట్ సినిమా తలకెత్తుకునేందుకు ఎవరూ అంతగా ఆసక్తి కనబరచడంలేదని సమాచారం. ఈ నేపథ్యంలో లైకా సంస్థకు అగ్రిమెంట్ చేయడం మినహా శంకర్ కు మరో మార్గం లేదు. మరి ఈ విషయంలో శంకర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.