Intelligence Department Notice to CM to pay vehicles bills
తెలంగాణా ఎన్నికల సమయంలో వినియోగించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు డబ్బులు చెల్లించాలని సీఎం కార్యాలయానికి లేఖ చేరింది. ఇక ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ పంపిన ఈ లేఖతో సీఎం కు కూడా ఈ ఛార్జీలలో మినహాయింపు లేదని తేలిపోయింది. మీరు వాడిన బులెట్ ప్రూఫ్ కారు బకాయిలు చెల్లించండి సర్… అంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కి పోలీసు శాఖ లేఖ రాసింది. గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కేసీఆర్ స్టార్ క్యాంపైనర్ గా వ్యవహరించారు. కాగా.. ఈ ప్రచారంలో కేసీఆర్ ఉపయోగించిన బులెట్ ప్రూఫ్ వాహన బకాయిలు చెల్లించాలని పోలీసులు కేసీఆర్ ని కోరారు.
కేసీఆర్ తోపాటు మరో 33మంది నేతలకు పోలీసులు లేఖలు రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గత ఏడాది సెప్టెంబర్ 6 నుంచి డిసెంబర్ 7 వరకు సీఎం కేసీఆర్ సహా 33మంది రాజకీయ నాయకులకు బెలెట్ ప్రూఫ్ వాహనాలతో భద్రత కల్పించినట్లు వారు వివరించారు. ప్రత్యేకంగా డ్రైవర్లను కూడా కేటాయించినట్లు పోలీసులు వివరించారు. పోలీసులు లేఖలు రాసిన నేతల్లో సీఎం కేసీఆర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి, మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీలతో పాటు అన్ని పార్టీల స్టార్ క్యాంపెయనర్‌లు ఉన్నారని తెలిపింది. కిలోమీటర్ల ఆధారంగా ధరను నిర్ణయించామని, ఒక్కో నాయకుడు రూ.57 వేల నుంచి రూ.7.7 లక్షల వరకు బకాయి ఉన్నట్లు వెల్లడించింది. మొత్తానికి ఈ వార్త కాస్త షాకింగ్ గా అనిపించినా లెక్క లెక్కే కదా