intelligence report had warned of terror attack
భారత దేశంపై ఉగ్ర పంజా విసరటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? పుల్వామా తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారా? ఉగ్రవాదులు మరోసారి దేశంలో విధ్వంసం సృష్టించేందుకు పక్కాస్కెచ్ వేశారా ?అంటే అవును అంటున్నాయి ఇంటలిజెన్స్ వర్గాలు . గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఐఈడీ బ్లాస్ట్‌కు తెగబడ్డారు. ఈ ఘటనలో 40మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. తాజాగా ఈ ఘటన జరిగి ఏడాది కావస్తున్న నేపథ్యంలో మరోసారి ఉగ్రదాడి జరిపేందుకు పాక్ ముష్కరులు వ్యూహాలు పన్నినట్లు తెలుస్తోంది.
జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన 27 మంది పాక్ ఉగ్రవాదులు.. బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరంలో శిక్షణ పొందారని ఇంటలిజెన్స్ పేర్కొంది. ఈ శిబిరం నుంచి 27 మంది ఉగ్రవాదులు.. మనదేశంలోకి అక్రమంగా చొరబడి.. మరో పుల్వామా లాంటి దాడులకు ఒడిగట్టేందుకు స్కెచ్ వేస్తున్నారని హెచ్చరికలు జారీ చేసింది. జైషే మహ్మద్ చీఫ్.. మసూద్ అజహర్ కుమారుడు యూసుఫ్ అజహర్ బాలాకోట్ లోని 27 మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారని.. శిక్షణ పొందిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల్లో పాక్ పంజాబ్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాలకు చెందిన వారున్నట్లు తెలుస్తోంది. పాక్ జవాన్లు సరిహద్దుల్లో తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సమయంలో.. జవాన్ల దృష్టి మరల్చి.. దేశంలోకి చొరబడేందుకు ప్లాన్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాక్ గతకొద్ది రోజులుగా తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర పారామిలటరీ బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆర్మీ ఉగ్ర కుట్రలను విచ్చిన్నం చేసే పనిలో ఉంది .