కేటీఆర్ ఆత్మవిశ్వాసం సడలిందా?

Is Ktr Self Confidence Down?

పార్లమెంట్ ఎన్నికల్లో ’సారు, కారు.. పదహారు‘ అన్నారు..
గత జీహెచ్ఎంసీ పోరులో ’వంద సీట్లు ఖాయం’ అని ప్రచారం చేశారు..
దుబ్బాకలో ’అరవై వేల మెజార్టీ‘ అన్నారు..

మొదటి రెండింట్లో అనుకున్న లక్ష్యానికి కొంచెం అటుఇటుగా చేరుకున్నప్పటికీ.. దుబ్బాకలో టీఆర్ఎస్ బొక్కబోర్లాపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్ల సంఖ్య విషయంలో కేటీఆర్ నిర్దిష్ఠమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. కేవలం మేయర్ సీటు తమదేనని అంటున్నారే తప్ప.. ఎన్ని సీట్లు వస్తాయనే విషయంలో పెద్దగా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఎల్లప్పుడూ ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపించే యువమంత్రి మేజిక్ ఫిగర్ గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే, ఈసారి ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటి ఎదురు అవుతుండటమే ప్రధాన కారణమా?

గత జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రస్తుత ఎన్నికలకు తేడా ఏమిటంటే.. అప్పుడింకా తెలంగాణ కొత్త రాష్ట్రం.. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమూ కొత్తదే. డెవలప్మెంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి, ఒక్కసారి అధికారం ఇచ్చి చూద్దామంటూ గంపగుత్తగా నగరవాసులు ఓటేశారు. 99 సీట్లను కట్టబెట్టారు. కాకపోతే, ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందనే అసంత్రుప్తి ప్రజల్లో గట్టిగా నెలకొన్నది. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ లీడర్లు, ప్రజాప్రతినిధులు ప్రజలను రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. అందుకే, నగరంలోని సకల వర్గాలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేస్తామని అంటున్నారు. దీనికి వారు చూపెట్టే కారణాలు పైకి పెద్దగా చెప్పడం లేదు. అయితే, కేవలం మార్పు కోరుకుంటున్నారని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

దుబ్బాక ఎన్నికల తరహాలో ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఐపీఎల్ మ్యాచు కంటే భలే థ్రిల్లింగ్ గా ఉంటాయని కచ్చితంగా చెప్పొచ్చు. భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచులో ఉన్నంత థ్రిల్ ఈసారి ఎన్నికల్లో కనిపిస్తుంది. అయితే, ఈసారి టీఆర్ఎస్ పార్టీలో ముందున్న ఆత్మవిశ్వాసం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఎందుకంటే, ఇప్పటివరకూ టీఆర్ఎస్ కు ఎదురొడ్డి నిల్చోని ధైర్యంగా పోరాటం చేసిన పార్టీ లేనే లేదు. ప్రస్తుతం బీజేపీ ఆ పాత్ర పోషిస్తోంది. అందుకే, ప్రజలకూ బీజేపీ మీద నమ్మకం ఏర్పడుతోంది. అయితే, బీజేపీ మీద వీరికి పెద్దగా ప్రేమ లేదు. కాకపోతే, ప్రత్యామ్నాయం లేదు కాబట్టి, కమలం గుర్తుకే ఓటేస్తామని అంటున్నారు. అందుకే, ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని మరింత పటిష్ఠం చేసింది. సుమారు మూడు వేల మంది ప్రస్తుతం ఇందులో పని చేస్తున్నారని సమాచారం. దుబ్బాకలో విఫలమైనట్లుగా ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విఫలం కావొద్దనే ఉద్దేశ్యంతో వీరంతా కసితో పని చేస్తున్నారని సమాచారం. ఏదీఏమైనా, ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తమకొచ్చే సీట్ల గురించి స్పష్టంగా ఎక్కడా చెప్పలేకపోవడం ఆత్మవిశ్వసం సడలిందా అనే సందేహం ప్రజల్లో నెలకొంది.

GHMC ELECTIONS EXCLUSIVE 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *