సుకుమార్ `పుష్ప2` కోసం పక్కా ప్రణాళికలతో రంగంలోకి దిగాడు. పుష్ప తొలి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌ని దృష్టిలో ఉంచుకుని… రెండో భాగాన్ని మరింత ఘనంగా మలచాలనేది ఆయన ఆలోచన. అందుకోసం పక్కా వ్యూహాల్ని రచించాడు. సినిమా మొదలుకాక మునుపే గ్లింప్స్‌ని రిలీజ్ చేసి సినిమా స్థాయి ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడు.అందుకోసం అవతార్ 2 రిలీజ్‌ని టార్గెట్ చేసుకున్నాడు. గ్లింప్స్ కోసమే ప్రత్యేకంగా కొన్ని రోజులు షూట్ చేశాడు. తీరా అవతార్ 2 రిలీజ్ దగ్గర పడే సమయానికి పుష్ప2 గ్లింప్స్ కోసం వాడాలనుకున్న డైలాగ్ బయటికి రావడం, గ్లింప్స్‌కి సంబంధించి ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌కూడా పూర్తి కాకపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు సుకుమార్. మరో మంచి టైమ్ చూసి గ్లింప్సో, లేదంటే టీజరో రిలీజ్ చేయాలని నిర్ణయించాడు.
అయితే అల్లు అర్జున్ బర్త్ డే దగ్గరికొస్తున్న సందర్భంగా పుష్ప2 టీజర్ విడుదల కావొచ్చనే టాక్ తాజాగా మొదలైంది. హీరోల పుట్టినరోజు సందర్భంగా వాళ్ల సినిమాలకి సంబంధించి ఏదో ఒక సందడి ఉండటం రివాజు.ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పుష్ప2 టీజర్ విడుదల చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. సినిమా మొదలై కూడా చాలా రోజులైంది. ఇప్పటికే ఒక కీలకమైన ఫైట్‌తోపాటు, ఓ పెద్ద సీన్ కూడా పూర్తిచేసినట్టు సమాచారం. అంతకుముందు గ్లింప్స్ కోసమని ప్రత్యేకంగా చేసిన షూటింగ్ రషెస్‌కూడా ఉంది. వీటన్నిటినీ కలిపి సుకుమార్ అదిరిపోయే ఓ టీజర్ విడుదల చేయనున్నాడని టాక్. మరి అది నిజమవుతుందో లేదో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.