ISMARTSHANKAR
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయి తీరాలి, అంతే! ఇదీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కి ఇప్పుడు వేరే దారిలేదు. టెంపర్ సినిమాకు ముందు ఎలాగైతే ఒక హిట్ కోసం పూరీ ఎదురు చూడాల్సి వచ్చిందో… ఇప్పుడూ అదే పరిస్థితి. టెంపర్ తరువాత వచ్చిన క్రేజ్ ని పూరీ నిలబెట్టుకోలేకపోయారు. సరైన హోం వర్క్ చేసుకోకుండానే… టకటకా సినిమాలు పట్టాలెక్కించేసి బోల్తాపడ్డాడు. బాలకృష్ణతో వచ్చిన ఛాన్స్ ని పైసా వసూల్ రూపంలో సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కొడుకుని కూడా మెహబూబాతో పక్కా హీరోగా లాంచ్ చెయ్యలేకపోయాడు. ఇప్పుడు, పూరీ ముందుంది ఇస్మార్ట్ శంకర్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు మాస్ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. హీరో రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ అవుతుందనే అంచనాలున్నాయి.
ఇక, ఇదే సినిమా ఛార్మీకి కూడా పరీక్షే. ఎందుకంటే, ఆమె పూరి కేంపులోకి వచ్చిన దగ్గర్నుంచే దర్శకుడిగా పూరీ కెరీర్ గాడి తప్పిందనే విమర్శలు చాలా ఉన్నాయి. పూరీ సొంత నిర్ణయాలు తీసుకున్నంత కాలం మాంచి సక్సెస్ లో ఉండేవాడనీ, ఎప్పుడైతే ఛార్మీ ఎంటరైందో గాడి తప్పిందని పూరీ సన్నిహితులు అంటుంటారు. ఛార్మీ వచ్చాకనే ఎప్పట్నుంచో పూరీ వెంటే ఉంటున్నవారిలో చాలామంది బయటకి వెళ్లిపోయారట! ఇస్మార్ట్ శంకర్ నిర్మాణంలో ఛార్మీ ఎంత కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. దీంతో, ఇప్పుడీ సినిమా హిట్ కొడితే… ఛార్మీ మీద ఉన్న కథనాలూ విమర్శలూ కొంతవరకూ తగ్గుతాయి. ఆమె జోక్యం అతిగా ఉన్నా కూడా సినిమా హిట్ పట్టాలే ఎక్కించందనే ఇమేజ్ వస్తుంది. కాబట్టి, పూరీతోపాటు ఛార్మీని కూడా ఇస్మార్ట్ శంకర్ గట్టెక్కించాల్సి ఉంది.