IT notices to gangster nayeem family members
గ్యాంగ్స్టర్ నయీం దారుణ ఎన్ కౌంటర్ కు గురైన విషయం తెలిసిందే. ఇక ఆయన ఎన్ కౌంటర్ తర్వాత ఆయన కుటుంబీకులు ఆదాయపన్ను శాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ బడితే అక్కడ ఆస్తులు, లెక్కలేనంత ధనం కలిగి వున్నారన్న ఆరోపణలతో నయీం కుటుంబీకులకు నోటీసులిచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఐటీ అధికారులకు దొరక్కుండా తప్పించుకుంటూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు . అందుకున్న నోటీసులను చిత్తుకాగితాలుగా పరిగణిస్తూ అధికారుల సహనాన్ని పరీక్షిస్తున్నారు.గ్యాంగ్ స్టర్ నయీం చనిపోయినా అతని నేరాల చిట్టాలో ఒక్కోటి వెలుగులోకి వస్తుంటే.. అతను కబ్జా చేసిన ఆస్తులు, బెదిరించి రాయించుకున్న భూములు, వసూలు చేసిన కోట్లాది రూపాయలు తెలిస్తే అవాక్కవటం ఖాయం.
ఈ క్రమంలోనే ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. నయీం భార్య, తల్లి, సోదరిలకు అక్రమ సంపాదనకు ఆధారాలు చూపాలంటూ నోటీసులిచ్చేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే 9 సార్లు నయీం కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే, ఐటీ అధికారులు ఇచ్చిన ఏ నోటీసుకు నయీం కుటుంబ సభ్యులు స్పందించడం లేదు సరికదా అస్సలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సుమారు 1000 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి నయీం కుటుంబ సభ్యుల నుండి ఐటీ శాఖ వివరణ కోరింది. తాజాగా నయీం అనుచరుడు పాశం శ్రీనుకు నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ ఆయన్ను విచారణకు రమ్మని ఆదేశించింది. మరోవైపు నయీం ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలను సిట్ అధికారుల నుండి ఐటీ అధికారులు సేకరించారు.