Ivanka Consider as World bank Chief
- బ్యాంకు ఉన్నత పదవికి పోటీపడుతున్న ట్రంప్ కుమార్తె
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్.. ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవికి పోటీపడుతున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రస్తుత అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ వచ్చేనెల ఒకటో తేదీన తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేసేందుకు బ్యాంకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ పదవి కోసం పోటీపడుతున్నవారి నుంచి పలు నామినేషన్లు అందుతున్నాయి. అమెరికా ట్రెజరీ అధికారి డేవిడ్ మల్ఫాస్, ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ వంటివారితోపాటు ట్రంప్ గారాలపట్టి ఇవాంకా పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇప్పటివరకు ప్రపంచబ్యాంకు అధ్యక్షుడి ఎంపికలో అమెరికా మాటే చెల్లుబాటు అయింది. బ్యాంకులో అత్యధిక వాటా ఉన్న నేపథ్యంలో అమెరికా మద్దతు ఎవరికి ఉంటే వారే వరల్డ్ బ్యాంకు చీఫ్ గా ఎంపియ్యారు. ఈ పరిస్థితుల్లో ఇవాంకా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందిన నామినేషన్లను షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి, వారిలో ఒకరికి బోర్డు బాధ్యతలు అప్పగిస్తుంది. ప్రపంచ బ్యాంకు చీఫ్ పదవికి ఎంపికైన వ్యక్తి ఐదేళ్లపాటు అందులో కొనసాగుతారు. ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ ను 2011లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. మళ్లీ 2016లోనూ కిమ్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం 2021 వరకు ఉన్నప్పటికీ, కిమ్ ముందుగానే వైదొలుగుతుండటంతో ఎన్నిక అనివార్యమైంది.