వైసీపీది కీలక పాత్ర అన్న జగన్

Jagan told YSRCP in Key position – కేంద్రంలో హంగ్…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ వస్తుందని చెప్పారు. జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే కూటమికే మద్దతు పలుకుతామన్నారు. అన్న పిలుపు కార్యక్రమంలో తటస్థులు, మేధావులతో జగన్ సమావేశమయ్యారు. పాదయాత్రతో ప్రజలతో మమేకమైన జగన్ మోహన్ రెడ్డి ఇప్పడు తటస్థులు, మేధావులు, సమాజ సేవలో ఉన్న వ్యక్తులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వార్థం లేకుండా సమాజ సేవ చేస్తున్న వారితో సమావేశమవుతున్నారు. 150 మంది తటస్థులతో లోటస్ పాండ్ లో జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర రాజకీయాలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మద్దతురాదని హంగ్ తప్పదన్నారు. ఇది రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఎవరితో పొత్తులుండవని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా ఫైలుపై సంతకం చేసిన తర్వాతే మద్దతు ఇస్తామన్నారు. హంగ్ ప్రభుత్వంలో వైసీపీ కీలక పాత్ర పోషిస్తుందన్న జగన్ 25 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారన్నారని జగన్ ఎద్దేవా చేశారు. తటస్థుల సమావేశంలో మేనిఫెస్టో అంశాలను వివరించారు. ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో సంక్షేమ పథకాలు మంజూరు చేస్తామని చెప్పారు. కంపెనీల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు కట్టబెట్టేలా ప్రత్యేక చట్టం తెస్తామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ప్రతి మే నెలలో ఏకరానికి 12,500 రూపాయలు అందిస్తామన్నారు జగన్. లోటస్ పాండ్ కేంద్రంగా జరిగిన అన్న పిలుపు కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రతి జిల్లాలో ఇదే తరహా సమావేశాలు పెట్టాలని భావిస్తున్నారు. 70వేల మందితో సమావేశం నిర్వహించడం ద్వారా తటస్థులను ఆకట్టుకోవాలన్న వైసీపీ యత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article