JAGGAREDDY SENSATIONAL COMMENTS
ముందస్తు ఎన్నికల్లో గెలిచినా తర్వాత నుండి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఒక దాని తర్వాత ఒకటి వరుసగా సొంత పార్టీ పై చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్కకు సీఎల్పీ నేతగా అవకాశం ఇవ్వడం పై ఆయన సంచలన కామెంట్ చేశారు. సామాజిక కోణమే కాదు, లాబీయింగ్ కూడా భట్టి విక్రమార్కకు సీఎల్పీ నేతగా అవకాశం రావడానికి కారణమైందని జగ్గారెడ్డి చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీలో తాను తప్ప ప్రతి ఒక్కరు స్టార్ లేనని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ నిర్ణయంతో పాటు లాబీయింగ్ వల్ల కూడ మల్లు భట్టి విక్రమార్కకు సీఎల్పీ పదవి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. మా పార్టీలో నేను తప్ప అందరూ కూడ స్టార్లేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు.ఎర్రవెల్లిలో కేసీఆర్ నిర్వహించే చండీ యాగానికి నన్ను పిలిచేంత ప్రోటోకాల్ తనకు లేదని జగ్గారెడ్డి తెలిపారు. సీఎం దగ్గర సీఎల్పీ నేతకు ఉన్న ప్రాధాన్యత పీసీసీ చీఫ్‌కు ఉండకపోవచ్చని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు ఉత్తమ్ పీసీసీ చీఫ్‌గా కొనసాగాలని చెప్పారు.
ఎన్నికల ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కావాలని సర్వే సత్యనారాయణ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఏమైందో కానీ ఉత్తమ్ మీద సర్వే సత్యనారాయణ వ్యక్తిగత విమర్శలు చేశారని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక సామాజిక కోణం పనిచేయడం లేదన్నారు. రాహుల్ గాంధీ మల్లు భట్టి విక్రమార్కకు మంచి అవకాశం కల్పించారని చెప్పారు.
అసలు జగ్గారెడ్డి బాధ ఏమిటో తెలియదు కానీ సొంత పార్టీపైనే తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఆయనకు పదవి దక్కక పోవడమే ప్రస్తుత వ్యాఖ్యలకు కారణమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక అదే విధంగా జగ్గారెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో తన భార్యకు టిక్కెట్ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుందో. ఈలోపు జగ్గారెడ్డి మరెన్నిసంచలనాలకు కారణమవుతారో వేచి చూడాల్సిందే.