- 8 కి.మి వర్షంలో పరిగెత్తి రక్షించిన పోలీసు శునకం
కుక్కులు మనుషులను కరిచి ప్రాణాలు తీస్తున్నాయని మాత్రమే మనం ఇప్పటి వరకు విన్నాము. కాని కుక్కలు సైతం ప్రాణాలు కాపాడతాయని నిరూపించిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసు శాఖకు చెెందిన జాగిలం చేసిన పనికి ప్రజలంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
పోలీస్ డాగ్ చూపిన సాహాసానికి ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. భారీ వర్షంలో 8 కిలోమీటర్లు పరిగెత్తిన పోలీసు జాగిలం హంతకుడి బారి నుంచి ఓ మహిళ ప్రాణాలను కాపాడింది. హత్యకు గురైన వ్యక్తి మృత దేహం వద్ద వాసన చూసిన పోలీస్ డాగ్ అతడు మరో హత్య చేయకుండా అడ్డుకోగలిగింది.
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో కర్ణాటకలోని సంతబెన్నూరులోని పెట్రోలు బంక్ సమీపంలో హత్యకు గురైన ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న దావణగెరె ఎస్పీ ఉమా ప్రశాంత్ వెంటనే స్పందించారు.
పోలీస్ డాగ్ తుంగ 2, దాని హ్యాండ్లర్ అయిన కానిస్టేబుల్ షఫీతో పాటు పోలీస్ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించారు. డాబర్ మ్యాన్ జాతికి చెందిన సదరు పోలీసు జాగిలం ఆ మృతదేహం వద్ద వాసన పసిగట్టి.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హంతకుడ్ని పసిగట్టేందుకు అక్కడి నుంచి పరుగుపెట్టింజి.
ఆ సమయంలో భారీ వర్షం కురుస్తున్నా.. వానలో అలుపు లేకుండా సుమారు 8 కిలోమీటర్ల దూరం పరుగెత్తిందా పోలీసు జాగిలం. అక్కడ చన్నాపురా గ్రామంలోని ఒక ఇంటి వద్ద ఆగి గట్టిగా మొరగం మొదలుపెట్టింది. పోలీస్ డాగ్‌ను వెంబడిస్తూ వచ్చిన పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్ధలుకొట్టి లోపలికి వెళ్లి ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆ గదిలో సదరు హంతకుడు ఒక మహిళను కొట్టి చంపుతున్నాడు. స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న ఆ మహిళను హంతకుడి చెర నుంచి పోలీసులు రక్షించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఓ మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసు జాగిలాన్ని ప్రత్యేకంగా అభినందించారు స్థానికులు.