అలనాటి అందాల నటి శ్రీదేవి బతికున్నప్పటి నుంచీ ఆమె కూతురు జాన్వి తెలుగు సినిమా ఎంట్రీ గురించి చర్చ నడుస్తూనే ఉంది. శ్రీదేవిని కూడా పలువురు టాలీవుడ్ దర్శకనిర్మాతలు జాన్వి కోసం సంప్రదించారు. ఒక దశలో శ్రీదేవి నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` రీమేక్ అవుతుందని, అందులో చిరంజీవి తనయుడు చరణ్, శ్రీదేవి తనయ జాన్వి నటిస్తుందని కూడా పుకార్లొచ్చాయి. కానీ అది జరగలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తోనూ ముడిపెట్టి ఆయన సరసన జాన్వి నటిస్తుందనే ప్రచారం సాగింది. తీరా జాన్వి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కూడా యేళ్లు గడుస్తున్నా ఆమె ఇంకా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టలేదు. ఈమధ్య హైదరాబాద్‌కి వచ్చిన జాన్వి త్వరలోనే తన తెలుగు ఎంట్రీ గురించి చెబుతానంది. అన్నట్టుగానే ఆమె టాలీవుడ్ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది.
ఎన్టీఆర్ సరసన ఆమె నటించబోతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలోనే ఆ జోడీ సందడి చేయనుంది. ఇప్పటికే ఇద్దరికీ మధ్య ఫొటోషూట్‌లు కూడా పూర్తయ్యాయి. మార్చి 6న జాన్వి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ సరసన నటించడం ఖాయమన్న విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. సినిమా ఈ నెల 24న ప్రారంభం కావల్సి ఉన్నప్పటికీ తారకరత్నమరణంతో వాయిదా పడింది. వచ్చే నెలలోనే సినిమాని ప్రారంభించే అవకాశాలున్నాయి.