మంగళగిరి బరిలో జనసేన

JANASENA CONTESTS IN MANGALAGIRI

  • చివరి నిమిషంలో అభ్యర్థి ఖరారు
  • ఇప్పటికే ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించిన పవన్
  • తాజాగా తాము కూడా పోటీ చేయాలని నిర్ణయం

మంగళగిరి నుంచి తమ అభ్యర్థిని కూడా రంగంలోకి దింపాలని జనసేన అనూహ్య నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో ఈ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించిన మంగళగిరి స్థానంలో పార్టీ అభ్యర్థిని ప్రకటించి సంచలనం సృష్టించింది. దీంతో జనసేన తరఫున చల్లపల్లి శ్రీనివాస్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఈ స్థానంలో టీడీపీ నుంచి నారా లోకేశ్‌, వైఎస్సార్ సీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో నిలిచారు. అయితే, జనసేన నిర్ణయం పట్ల సీపీఐ అసంతృప్తి వ్యక్తంచేసింది. పొత్తులో భాగంగా తమకు కేటాయించిన సీట్ లో జనసేన అభ్యర్ధిని ప్రకటించడం సబబు కాదని పేర్కొంటోంది. జనసేన పార్టీ.. వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తుల్లో భాగంగా ఏడు అసెంబ్లీతో పాటు, రెండు పార్లమెంట్‌ స్థానాలను సీపీఐకి కేటాయించింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చడంపై సీపీఐ నేతలు అసంతృప్తికి గురయ్యారు. అనంతరం ఆ పార్టీ నేతలు జనసేనతో చర్చలు జరిపి సర్దుబాటు చేసుకున్నారు. తాజాగా మంగళగిరిలోనూ జనసేన తమకు ఝలక్ ఇవ్వడంపై సీపీఐ మండిపడుతోంది. సీపీఐ తరఫున ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా.. చల్లపల్లి శ్రీనివాస్‌ను జనసేన ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. నామినేషన్లకు సోమవారమే చివరి రోజు అయినందున ఈ విషయంలో రెండు పార్టీలు ఎలా ముందుకెళ్తాయో అనేదానిపై ఆసక్తి నెలకొంది.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article