JANESENA MEETINGS
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన పార్టీని గాడిలో పెట్టే దిశగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు. తాను పార్ట్ టైం పొలిటీషియన్ కాదని, పూర్తి స్థాయి రాజకీయ నేతనే అనే భావనను కేడర్ లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేనను సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పొలిట్‌బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీలను ప్రకటించిన పవన్.. సోమవారం నుంచి పార్టీ కమిటీలు, నేతలు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి, విజయవాడలోని పార్టీ కార్యాలయాల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు శనివారం మధ్యాహ్నం ఆ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ నిర్మాణంలో భాగంగా క్రియాశీలక కార్యకర్తలు, ముఖ్యనేతలతో ఆయన చర్చించనున్నారు. 29న ఉదయం 11 గంటల నుంచి పార్టీ నేతలు వివిధ కమిటీ సభ్యులతో పవన్ సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుంది. 30న ఉదయం 11 గంటలకు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం, 4 గంటలకు కాకినాడ, 31న ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశాలు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.