కారులో శవంతో పోలీస్ స్టేషన్ కు…

JAYARAM MURDER CASE

  • హైదరాబాద్ లో ఐదు గంటలపాటు చక్కర్లు
  • చిగురుపాటి జయరామ్ హత్యకేసులో విస్తుపోయే వాస్తవాలు

కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. హత్య తర్వాత నిందితుడు రాకేష్ రెడ్డి జయరామ్ మృతదేహాన్ని కారులో వేసుకుని హైదరాబాద్ లో ఏకంగా 5 గంటలపాటు చక్కర్లు కొట్టినట్టు తేలింది. అంతేకాకుండా మృతదేహంతో నల్లకుంట ఠాణా వద్దకు వెళ్లి ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ కోసం 40 నిమిషాలపాటు వేచిచూసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. జయరామ్ హత్య కేసు నిందితులైన రాకేష్ రెడ్డి, వాచ్ మెన్ శ్రీనివాస్ లను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు బుధవారం ఇరువురినీ విచారించారు. ఈ సందర్భంగా అసలు ఆ రోజు ఏం జరిగిందనే అంశాలను రాకేష్ వివరించినట్టు తెలిసింది. జయరామ్ మేనకోడలు శిఖా చౌదరితో పరిచయం తర్వాత రాకేష్ రెడ్డికి జయరామ్ తో స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో తన ఆర్థిక అవసరాల నిమిత్తం జయరామ్.. రాకేష్ నుంచి రూ.4.17 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అది వడ్డీతో కలిపి రూ.6 కోట్లు అయింది. ఆ మొత్తాన్ని గతేడాది అక్టోబర్ లోనే రాకేష్ కు చెల్లించాల్సి ఉంది. అయితే, జయరామ్ ఆ ఊసు ఎత్తలేదు. ఈ నేపథ్యంలో గతనెల 29న జయరామ్ హైదరాబాద్ వచ్చిన విషయం తెలుసుకున్న రాకేష్.. డబ్బు కోసం ఆయనకు ఫోన్ చేశాడు. జయరామ్ స్పందించకపోవడంతో వీణ పేరుతో చాటింగ్ చేసి హానీ ట్రాప్ విసిరాడు. అనంతరం పథకం ప్రకారం గతనెల 30న తన ఇంటికి రప్పించి నిర్బంధించాడు. 31న మధ్యాహ్నం డబ్బు విషయంపై ఇరువురి మధ్య గొడవ జరగ్గా.. జయరామ్ పై రాకేష్ పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

వాచ్ మెన్ సహకారంతో ఆ మృతదేహాన్ని కారులో వేసుకుని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చక్కర్లు కొట్టాడు. తన స్నేహితుడైన ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ ను కలిసేందుకు అదే కారులో నేరుగా నల్లకుంట పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అయితే, ఆ సమయంలో ఆయన లేకపోవడంతో 40 నిమిషాలపాటు అక్కడే వేచి ఉన్నాడు. ఆ సమయంలోనే ఇన్ స్పెక్టర్ తోపాటు ఏసీపీ మల్లారెడ్డితో పలు సార్లు ఫోన్ లో మాట్లాడాడు. వారి సూచనల మేరకు ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఇరువురి పోలీసుల సూచనలతో జయరామ్ మృతదేహాన్ని తీసుకుని విజయవాడ వైపు బయలుదేరాడు. నందిగామ దాటిన తర్వాత జయరామ్ నోట్లో కొంత, ఆయన వస్త్రాలపై కొంత బీరు పోసి కారును రోడ్డు పక్క వదిలేసి, బస్సులో హైదరాబాద్ వచ్చేశాడు. అనంతరం తాను గోవాకు వెళ్లానని, ఏపీ పోలీసులు తనను ఈనెల 3న శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారని విచారణలో చెప్పినట్టు సమాచారం. రాకేష్‌కు చెందిన 2 కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆయన ఫోను, సిమ్‌కార్డులను, బ్యాంకు ఖాతాలను విశ్లేస్తున్నారు. ఈ కేసులో నోటీసులు ఇచ్చిన మరికొందరిని గురువారం విచారించే అవకాశం ఉంది. మరోవైపు జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిని కూడా పోలీసులు విచారించారు.

CRIME NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article