JOB NOTIFICATIONS IN AP
- 1,26,728 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
- నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ లో కొలువుల జాతర మొదలైంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా ఉద్యోగ నియామకాలకు తెర తీసింది. ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్ శాఖ.. పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ నోటిఫికేషన్లను వేర్వేరుగా జారీచేశాయి. శనివారం ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. gramasachivalayam. ap. gov. in, vsws. ap. gov. in, wardsachivalayam. ap. gov. in అనే వెబ్ సైట్ల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. సెప్టెంబరు ఒకటవ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు. నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తు ఫారం, ఏ ఉద్యోగానికి ఏయే విద్యార్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ వంటి వివరాలను ఆయా వెబ్సైట్లలోనే అందుబాటులో ఉంచుతారు. ప్రతి ఉద్యోగానికి 150 మార్కులకు రెండు పేపర్ల విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఇప్పటికే ఆయా శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు వారికి అర్హత ఉండి రాత పరీక్షకు హాజరైతే.. అలాంటి అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు 9,359 ఎనర్జీ అసిస్టెంట్ (లైన్మెన్) ఉద్యోగాల భర్తీకి కూడా వేరుగా నోటిఫికేషన్ రానుంది.