Journalist protest BJP Meet
చత్తీస్ గడ్ లో విలేకరులు ఒక వింత నిరసనకు దిగారు. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి హెల్మెట్ తప్పనిసరి అని భావించారు.. అందుకే మీడియా సమావేశాలకు వెళ్తున్న క్రమంలో హెల్మెట్ ధరించి మరియు వెళ్తున్నారు. బిజెపి సమావేశాలకు ఐతే కచ్చితంగా హెల్మెట్ ధరించి బీజేపీ నేతల వాయిస్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని విలేకరులు వాళ్ళు బైక్ పై వెళ్ళేటప్పుడు కాదు.. మీడియా సమావేశాలకు వెళ్ళేటప్పుడు హెల్మెట్లు పెట్టుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే.. రాయ్‌పూర్‌లో స్థానిక బీజేపీ నేతలు నిర్వహించిన కార్యక్రమానికి విలేకరులు మైక్, కెమెరాలతో పాటు హెల్మెట్లు ధరించి వచ్చారు. ఇదేంటి హెల్మెట్లు పెట్టుకొని వచ్చారని అడిగితే.. ‘ఇటీవల సుమన్ పాండే పై బీజేపీ నేతలు చేసిన దాడికి నిరసనగా మేం హెల్మెట్లు పెట్టుకున్నాం. అంతేగాక.. ఒకవేళ వారు మళ్లీ మాపై దాడి చేసినా హానీ జరగకుండా ఉండేందుకే ఇలా ముందుగా జాగ్రత్త పడ్డాం’ అని విలేకరులు తెలిపారు.
గత శనివారం ఓ మీడియా సమావేశంలో జర్నలిస్టు సుమన్ పాండేపై కొందరు బీజేపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో అతడి తలకి గాయమైంది. ‘సమావేశాన్ని మేం ఫోన్లలో రికార్డు చేస్తుండగా కొందరు బీజేపీ నేతల మధ్య ఏదో విషయమై వాగ్వాదం జరిగింది. అది కూడా మా ఫోన్లలో రికార్డయ్యింది. దాన్ని డిలీట్ చేయమని వారు మాపై ఒత్తిడి తెచ్చారు. నేను అందుకు ఒప్పుకోకపోవడంతో నాపై దాడి చేసి బలవంతంగా వీడియోను తొలగించారు’ అని సుమన్ పాండే తెలిపారు. ఈ ఘటనపై విలేకరులు ఆందోళన చేపట్టారు. బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పాండే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన బీజేపీ నేతలను అరెస్టు చేశారు. సుమన్ పాండే పై జరిగిన దాడికి నిరసనగానే విలేకరులు హెల్మెట్లతో దర్శనమిచ్చారు.