సీఎం అమెరికా టూర్‌కు జంబో టీం
సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 2వ తేదీ నుంచి 14వరకు అమెరికా పర్యటనకు వెళ్లనుండగా అమెరికా పర్యటన బృందంలో చోటుకు కోసం పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ల్యాబియింగ్ చేసుకున్నట్లుగా ప్రచారం సాగుతుంది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి వెంట జంబో టీమ్ అమెరికాకు వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా మంత్రివర్గంలో చోటు కోసం లాబీయింగ్ చేస్తున్న ఎమ్మెల్యేలు, ఇతర కార్పొరేషన్ పదవుల కోసం ఆశావహులు అనేకమంది రేవంత్ వెంట అమెరికా వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. ఇక్కడ రేవంత్ రెడ్డి బిజీగా ఉండటం వల్ల టైం ఇవ్వడం లేదని, అమెరికాలో కొంత సమయం దొరికే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో సుమారు డజన్ మంది నాయకులు ఎయిర్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారన్ని చర్చ వినిపిస్తుంది.
రేవంత్ పర్సనల్ పీఆర్ టీమ్ కూడా భారీగానే ఉండబోతుందని సమాచారం. రేవంత్ టీమ్‌లో డెక్కన్ క్రానికల్ ఎడిటర్ శ్రీరాం కర్రి పేరు ఇదివరకే ఖరారు అయ్యిందని, అయితే ఆయనను ఏ హోదాలో గతంలో దావోస్ పర్యటనకు తీసుకెళ్లారంటూ ప్రశ్నిస్తూ సంబంధిత నోట్ ఫైల్ కాపీ కావాలంటూ పలు మీడియా సంస్థల జర్నలిస్టులు సమాచార హక్కు చట్టం కింద సెక్రటేరియట్‌లో దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఆయన ఎంపికపై ప్రభుత్వం కొంత డైలమాలో ఉందని తెలుస్తుంది.
ఇక సీఎం సీపీఆర్వో బోరెడ్డి అయోధ్య రెడ్డి సహా మరో ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు కూడా సీఎం రేవంత్‌రెడ్డి వెంట అమెరికా వెళ్లే పనిలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. మొత్తానికి ఈసారి రేవంత్ పర్యటనలో జంబో టీమ్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర ఖజానాకు ఖర్చు కూడా భారీగానే ఉంటుందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. జూన్ నెలలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో అనౌన్స్ చేయకుండా ఆపిన నాలుగైదు పెట్టుబడుల ప్రకటనలు కూడా ఈ దఫా సీఎ రేవంత్ రెడ్డి పర్యటనలో చేస్తారని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.