కల్కి అవినీతి సామ్రాజ్యం 

Kalki is a corrupt empire

చిత్తూరు జిల్లాలో  కల్కి భగవాన్ ఆశ్రమంపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల్లోనమ్మలేని నిజాలు  వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని వరదయ్యపాలెం సమీపంలో ఉన్న ఆశ్రమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని కల్కి భగవాన్ అక్రమాలు, అవినీతి సామ్రాజ్యం విస్తరించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో పెద్ద ఎత్తున  కల్కి భగవాన్  స్థిరాస్తులను కూడబెట్టినట్లు వెల్లడైంది.
భక్తుల నుంచి డొనేషన్ల రూపంలో ఆశ్రమానికి వచ్చిన వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై తమిళనాడుకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం నుంచి వరదయ్య పాలెం ఆశ్రమంలో విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.  చిత్తూరు జిల్లాలోని వరదయ్య పాలెం బత్తలవల్లంలో గల ఆశ్రమంలో వరుసగా రెండోరోజు సోదాలను నిర్వహిస్తున్న దక్షిణాది జోన్ ఐటీ అధికారుల బృందం సుమారు 25 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు  రెండురోజుల్లో స్వాధీనం చేసుకున్న నగదు 33 కోట్లకు చేరింది. ఇందులో తొమ్మిది కోట్ల రూపాయల విలువ చేసే విదేశీ కరెన్సీ ఉన్నట్టు సమాచారం .ఈ సందర్భంగా అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లు, 25 కోట్ల రూపాయల లెక్క చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ సహా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భూములు, విల్లాలను కొనుగోలు చేసినట్లు నిర్ధారించారని అంటున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు తేలడంతో.. ఆయా రాష్ట్రాల ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు, హైదరాబాద్, తమిళనాడులోని కోయంబత్తూరు, చెన్నై శివారు ప్రాంతాలు, కాంచీపురం వంటి చోట్ల తనిఖీలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆశ్రమాల్లో సోదాల కోసం దక్షిణాది జోన్ ఐటీ అధికారులు మొత్తం 16 బృందాలను ఏర్పాటు చేశారు. 400 మందికి పైగా అధికారులు తనిఖీల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. కల్కి భగవాన్ ఆశ్రమానికి ఆఫ్రికాలో వ్యవసాయ భూములు ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీన్ని అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. గల్ఫ్ లోని ఖతర్ లోనూ భూములను కొనుగోలు చేసినట్లు తేలిందని అంటున్నారు. రెండురోజులుగా విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నప్పటికీ.. సంబంధిత అధికారుల వద్ద నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ, వరదయ్య పాలెం ఆశ్రమం ఇన్ ఛార్జి లోకేష్ దాసాజీని అదుపులోకి తీసుకున్నారు. కల్కి ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలపై ఆరా తీస్తున్నారు. అధికారులు సంధించే పలు ప్రశ్నలకు వారు సమాధానాలను ఇవ్వట్లేదని, విచారణకు సహకరించట్లేదని తెలుస్తోంది. సోదాల్లో లభ్యమైన డాక్యుమెంట్లో చాలా వాటిపై కల్కి భగవాన్, ఆయన భార్య, కుమారుడు కృష్ణాజీ, ఇన్ ఛార్జి లోకేష్ దాసాజీల సంతకాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ నలుగురు కాకుండా మరి కొందరి సంతకాలు ఉండటంతో వారు బినామీలు అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే కల్కి భగవాన్ ఎక్కడ ఉన్నారనేది మాత్రం ఇంకా తెలియరాలేదు .

tags : kalki bhagavan, chittor, kalki ashramam, it raids, properties, forgein countries

తెలంగాణలో మద్యం దరఖాస్తుల వెల్లువతో కాసుల గలగల

హుజూర్ నగర్ ఎవరి పరం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *